IPL 2024: రోహిత్ ఔట్.. నెక్స్ట్ టార్గెట్ పంత్: ఐపీఎల్‌లో అరుదైన రికార్డ్‌కు చేరువలో పరాగ్

IPL 2024: రోహిత్ ఔట్.. నెక్స్ట్ టార్గెట్ పంత్: ఐపీఎల్‌లో అరుదైన రికార్డ్‌కు చేరువలో పరాగ్

ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ యువ బ్యాటర్ రియాన్ పరాగ్ ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. మిడిల్ ఆర్డర్ లో టాప్ బ్యాటింగ్ తో అదరగొడుతున్నాడు. టోర్నీ ప్రారంభం నుంచి నిలకడగా ఆడుతూ రాజస్థాన్ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తూ వచ్చాడు. ప్లే ఆఫ్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లో 26 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 36 పరుగులు చేసి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఈ క్రమంలో ఐపీఎల్ లో రోహిత్ శర్మ రికార్డ్ బద్దలు కొట్టాడు.
 
ఒక ఐపీఎల్ సీజన్ లో నాలుగు లేదా అంతకంటే తక్కువ స్థానంలో బ్యాటింగ్ కు వచ్చి అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల లిస్టులో పరాగ్ రెండో స్థానానికి చేరుకున్నాడు. ప్రస్తుత సీజన్ లో పంత్ నెంబర్ 4 లో బ్యాటింగ్ చేస్తున్నాడు. 538 పరుగులతో నిన్నటివరకు రెండో స్థానంలో ఉన్న రోహిత్ ను పరాగ్ (567) అధిగమించాడు. ఈ లిస్టులో ఢిల్లీ క్యాపిటల్స్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ 579 పరుగులతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. 2019 ఐపీఎల్ సీజన్ లో పంత్ ఈ ఫీట్ సాధించాడు. పరాగ్ మరో 13 పరుగులు చేస్తే పంత్ రికార్డ్ బ్రేక్ చేసి ఈ లిస్టులో టాప్ లో నిలుస్తాడు. 

శుక్రవారం (మే 24) సన్ రైజర్స్ హైదరాబాద్ తో రాజస్థాన్ రాయల్స్ క్వాలిఫయర్ 2లో తలపడుతుంది. ఈ మ్యాచ్ లో గెలిస్తే రాజస్థాన్ ఫైనల్ ఆడే అవకాశం ఉంటుంది. అప్పుడు పరాగ్ ఈ రికార్డ్ ఈజీగా బ్రేక్ చేస్తాడు. ఒకవేళ పరాగ్ 12 పరుగుల తోపుకి ఔటై.. రాజస్థాన్ క్వాలిఫయర్ 2 లో ఓడిపోతే ఈ రికార్డ్ పంత్ ఖాతాలో పదిలంగా ఉంటుంది. పరాగ్ ప్రస్తుతం ఉన్న ఫామ్ ను చూస్తే.. ఈ రికార్డ్ బ్రేక్ అవ్వడం ఖాయంగా కనిపిస్తుంది.