
- లాలూ పంపిణీ చేసిన టికెట్లు వెనక్కి తీసుకున్న తేజస్వీ
పాట్నా: బిహార్ రాజకీయాల్లో సోమవారం అర్ధరాత్రి హైడ్రామా నడిచింది. ఆర్జేడీ చీఫ్ లాలూప్రసాద్ యాదవ్ పార్టీ లీడర్లకు బీఫామ్‌లు ఇవ్వగా.. వాటిని ఆయన కొడుకు, ఆర్జేడీ లీడర్ తేజస్వీ యాదవ్ వెనక్కి తీసుకున్నారు. ప్రతిపక్షాల కూటమి మహాఘట్‌బంధన్‌లో ఇంకా సీట్ల పంపకాలు పూర్తికాకముందే పార్టీ నేతలకు టికెట్లు కేటాయించడంతో తండ్రిపై తేజస్వీ యాదవ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. లాలూప్రసాద్ యాదవ్ సోమవారం ఢిల్లీ కోర్టులో హాజరై సాయంత్రానికి పాట్నా చేరుకున్నారు.
అప్పటికే ఆయన ఇంటి దగ్గర భారీ సంఖ్యలో నేతలు క్యూ కట్టారు. ఈ క్రమంలో కొంతమంది లీడర్లను పిలిచి, వాళ్లకు బీఫామ్‌లను లాలూ అందజేశారు. వాళ్లంతా తమకు టికెట్ దక్కిందంటూ ఎల్లో కవర్లు చూపిస్తూ మీడియా ఎదుట హర్షం వ్యక్తం చేశారు. అయితే ఈ విషయం ఢిల్లీలో ఉన్న తేజస్వీకి తెలిసింది. ఆయన ఆ టైమ్‌లో సీట్ల పంపకాలపై కాంగ్రెస్ అగ్రనేతలతో చర్చిస్తున్నారు. సీట్ల పంపకాలు పూర్తికాకముందే టికెట్లు ఇవ్వడంపై కాంగ్రెస్ హైకమాండ్ అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది.
దీంతో తేజస్వీ యాదవ్ వెంటనే పాట్నాకు చేరుకున్నారు. పార్టీ బీఫామ్స్ అందుకున్న నేతలను అర్ధరాత్రి ఇంటికి పిలిపించారు. వాళ్ల దగ్గరి నుంచి ఆ బీఫామ్స్‌ను వెనక్కి తీసుకున్నారు. బీఫామ్స్ వెనక్కి ఇచ్చిన వారిలో సునీల్ సింగ్, నరేంద్ర కుమార్ సింగ్ తదితరులు ఉన్నారు. కాగా, ఆర్జేడీ, కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు, వికాస్ శీల్ ఇన్సాన్ పార్టీ, జార్ఖండ్ ముక్తి మోర్చా, ఆర్జేఎల్పీ కలిసి మహాఘట్ బంధన్ కూటమిగా ఏర్పడ్డాయి.