అతిపెద్ద పార్టీ నుంచి మూడో ప్లేసుకు.. దారుణంగా పతనమైన ఆర్జేడీ..!

అతిపెద్ద పార్టీ నుంచి మూడో ప్లేసుకు.. దారుణంగా పతనమైన ఆర్జేడీ..!

పాట్నా: గతంలో వరుసగా రెండు అసెంబ్లీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన ఆర్జేడీ.. ఈసారి మూడో స్థానానికి పడిపోయింది. 2015లో 80 సీట్లు, 2020లో 75 సీట్లు సాధించిన ఆ పార్టీ.. ఇప్పుడు 25 సీట్లకే పరిమితమైంది. అంటే గత ఎన్నికలతో పోలిస్తే ఏకంగా 50 సీట్లను కోల్పోయింది. ఈ ఎన్నికల్లో బీజేపీ (20.34%), జేడీయూ (19.07%) కంటే ఆర్జేడీనే అత్యధిక ఓటు షేర్ (22.86%) సాధించినప్పటికీ.. సీట్లను మాత్రం దక్కించుకోలేకపోయింది.

ప్రతిపక్ష కూటమి మహాఘట్ బంధన్‌‌లో ఆర్జేడీనే ప్రధాన పార్టీ అయినా, ఆర్జేడీ యువ నేత తేజస్వీ యాదవ్‌‌ను సీఎం క్యాండిడేట్‌‌గా ప్రకటించినా.. ఆ పార్టీ ఆశించిన ఫలితాలను సాధించలేకపోయింది. ఆర్జేడీ చరిత్రలోనే 2010 అసెంబ్లీ ఎన్నికల్లో అత్యల్పంగా 22 సీట్లు సాధించగా.. ఈసారి 25 సీట్లతో రెండో అత్యల్ప సీట్లను ఆ పార్టీ గెలుచుకుంది.

తొలగని ‘జంగిల్‌‌రాజ్’ ముద్ర.. 

బిహార్‌‌‌‌లో 1990 నుంచి 2005 వరకు 15 ఏండ్ల పాటు ఆర్జేడీ పాలన కొనసాగింది. ఆ టైమ్‌‌లో రాష్ట్రంలో ఆటవిక పాలన సాగించి, ‘జంగిల్‌‌ రాజ్‌‌’ తెచ్చిందనే అప్రతిష్టను ఆ పార్టీ మూటగట్టుకుంది. 20 ఏండ్లవుతున్నా ఆ ముద్రను తొలగించుకోలేకపోయింది. 2005 ఫిబ్రవరిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ 75 సీట్లు సాధించింది. 

అదే ఏడాది అక్టోబర్‌‌‌‌లో తిరిగి ఎన్నికలు జరగ్గా, ఆర్జేడీ 54 సీట్లకే పరిమితమైంది. ఇక 2010లో అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ పరిస్థితి మరింత దిగజారింది. ఆ ఎన్నికల్లో పార్టీ చరిత్రలో అత్యల్పంగా 22 సీట్లకు పరిమితమైంది. ఆ తర్వాత జరిగిన 2015, 2020 అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా రెండుసార్లు 80, 75 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఇప్పుడు మళ్లీ 25 సీట్లకు పడిపోయింది. 

తేజస్వీ హ్యాట్రిక్ విజయం

ప్రతిపక్ష కూటమి మహాఘట్ బంధన్ సీఎం క్యాండిడేట్, ఆర్జేడీ యువ నేత తేజస్వీ యాదవ్ రాఘోపూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. తన కుటుంబానికి కంచుకోట అయిన ఈ సెగ్మెంట్ నుంచి ఆయన వరుస విజయాలతో హ్యాట్రిక్ కొట్టారు. ఈసారి రాఘోపూర్ నుంచి బీజేపీ తరఫున సతీశ్ కుమార్ యాదవ్, జన్‌‌ సురాజ్ పార్టీ నుంచి చంచల్ కుమార్.. తేజస్వీకి పోటీగా బరిలోకి దిగారు. 

తేజస్వీకి బీజేపీ క్యాండిడేట్ సతీష్​గట్టి పోటీ ఇచ్చారు. ఈ సెగ్మెంట్ ఓట్ల లెక్కింపు మొదటి నుంచి చివరి వరకూ ఉత్కంఠగా సాగింది. ఆరంభంలో తేజస్వీ ఆధిక్యంలో ఉన్నప్పటికీ.. ఆ తర్వాత సతీష్​ముందంజలో నిలిచారు. దీంతో తేజస్వీకి ఓటమి తప్పదేమోనని ఆర్జేడీ నేతల్లో ఆందోళన మొదలైంది. కానీ చివరి రౌండ్లలో తేజస్వీ పుంజుకున్నారు. మొత్తానికి 14,532 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.