
- ప్రియుడితో కలిసి మర్డర్ చేసి వాటర్ ట్యాంక్‌లో పడేసింది
పాలకుర్తి, వెలుగు : జనగామ జిల్లాలో ఓ ఆర్ఎంపీ డాక్టర్ ప్రమాదవశాత్తు చనిపోయాడని అనుకోగా అది హత్యేనని పోలీసులు తేల్చారు. ప్రియుడి మోజులో పడి భార్యే చంపించినట్టు విచారణలో తేలింది. శుక్రవారం ఆ వివరాలను ఏసీపీ శ్రీనివాస రావు తెలియజేశారు. జిల్లాలోని దేవరుప్పల మండలం సీతారాంపురం గ్రామానికి చెందిన పెండం సురేశ్ (35) , సరిత దంపతులకు కృషి ప్రియ, నాగలక్ష్మి పిల్లలు. కొన్నేండ్ల కింద ఇంటి పక్కనే ఉండే అభిలాష్‌తో సరితకు ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ విషయం సురేశ్‌కు తెలియడంతో గొడవలయ్యాయి. దీంతో సురేశ్ అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ నెల 3న అర్ధరాత్రి ఇంటికి వచ్చిన అభిలాష్..సరితతో కలిసి సురేశ్‌ను విచక్షణారహితంగా కొట్టారు. గొంతుపై కాలితో తొక్కి చంపారు. తర్వాత వాటర్ ట్యాంక్ లో డెడ్ బాడీని పడేశారు. తెల్లారిన తర్వాత చూసిన చుట్టుపక్కల వారు, మృతుడి తండ్రి ప్రమాదవశాత్తు చనిపోయాడని అనుకున్నారు.
కూతుర్ల సమాచారంతో ..
అందరూ ప్రమాదవశాత్తు చనిపోయారని అనుకున్నా సురేశ్ మృతిపై ఎస్ఐ రమేశ్‌కు అనుమానాలు కలిగాయి. మృతుడి ఇద్దరు కూతుళ్లను విచారించగా ముందుగా ఏమీ చెప్పలేదు. కానీ ఎవరూ లేనిది చూసి అడగడంతో అసలు విషయం బయటపెట్టారు. అభిలాష్ ఆ రోజు అర్ధరాత్రి ఇంటికి వచ్చాడని, తమ తల్లితో కలిసి కొట్టి చంపారని చెప్పారు. నాన్నను కొట్టొద్దని తాము బతిమిలాడితే బెదిరించారని ఏడ్చారు. దీంతో నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా నిజాన్ని ఒప్పుకున్నారు. దేవరుప్పుల ఎస్సై రమేష్, పాలకుర్తి సీఐ చేరాలును ఏసీపీ అభినందించారు. పాలకుర్తి ఎస్సై శ్రీకాంత్ పాల్గొన్నారు.