
హైదరాబాద్ సిటీలోని నడి బొడ్డున.. ప్రముఖులు నివాసం ఉండే ఏరియాలో రోడ్డు కుంగిపోయింది.. నాలాపై ఉన్న రోడ్డు కూలిపోయింది.. అదే సమయంలో ఆ రోడ్డుపై వెళుతున్న పెద్ద వాటర్ ట్యాంకర్ అందులో పడిపోయింది. ఈ ఘటన 2025, ఆగస్ట్ 5వ తేదీ ఉదయం జరిగింది. పెద్ద వాటర్ ట్యాంకర్ కాబట్టి సరిపోయింది.. అదే ఏ స్కూల్ బస్సో.. కారునో.. టూ వీలర్ వెహికల్స్ అయితే పరిస్థితి ఏంటీ అనే భయాందోళనలు వ్యక్తం చేశారు స్థానికులు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. జరిగిన ఘటన మాత్రం షాకింగ్ కు గురి చేసింది. ఎందుకంటే హైదరాబాద్ సిటీలో చాలా చోట్ల.. చాలా ప్రాంతాల్లో నాలాలపై ఇలాగే రోడ్లు ఉన్నాయి.. ఇప్పుడు వాటి పరిస్థితిని తలచుకుని సిటీ జనం భయపడుతున్నారు.. వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. ఈ ఘటన పూర్తి వివరాల్లోకి వెళితే..
బంజారా హిల్స్ రోడ్ నంబర్ 1 లో రోడ్డు కుంగిపోవడంతో వాటర్ ట్యాంకర్ నాలాలో పడిపోయింది. రోడ్డు మొత్తం ఒక్కసారిగా కుంగిపోవడంతో లోడ్ తో వెళ్తున్న వాటర్ ట్యాంకర్ నాలాలో ఇరుక్కుపోయింది. ఈ ఘటనలో ట్యాంకర్ డ్రైవర్ ప్రాణాలతో బయటపడ్డాడు. ఘటన జరిగిన సమయంలో రోడ్డు మీద ఎవరు లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. ఒక్కసారిగా రోడ్డు కుంగిపోయి, ట్యాంకర్ నాలాలో ఇరుక్కుపోవడంతో స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు.
►ALSO READ | ట్రంప్ డబుల్ గేమ్ : రష్యాతో బిజినెట్ కొనసాగిస్తున్న యూఎస్, ఇండియాపై ఆంక్షలు..!!
ఈ క్రమంలో ఘటనాస్థలి దగ్గర కొద్దిసేపు ట్రాఫిక్ జామ్ అయినట్లు తెలుస్తోంది. సిటీ నడిబొడ్డున, అందులోను బంజారా హిల్స్ లాంటి ప్రైమ్ ఏరియాలో ఇలాంటి ఘటన జరగటంతో జనం షాక్ అవుతున్నారు. ఈ ఘటనతో సిటీలోని మిగతా ప్రాంతాల్లో నాలాలపై రోడ్లు ఉన్న ప్రాంతాల్లో ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. పైగా వర్షాకాలం కావడంతో ఇలాంటి ఘటనలు తమ ఏరియాలో కూడా జరుగుతాయేమోనని భయపడుతున్నారు జనం.
ఈ ఘటనపై జీహెచ్ఎంసీ అధికారులకు సమాచారం అందించారు స్థానికులు. స్థానికుల ఫిర్యాదుతో ఘటనాస్థలికి చేరుకున్న అధికారులు నాలాలో ఇరుక్కుపోయిన వాటర్ ట్యాంకర్ ను బయటికి తీసే పనిలో పడ్డారు. వర్షాకాలంలో ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్న క్రమంలో అధికారులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని కోరుతున్నారు జనం.