రోడ్ల నిధులు బీఆర్కే భవన్ రిపేర్లకు మళ్లింపు

రోడ్ల నిధులు బీఆర్కే భవన్ రిపేర్లకు మళ్లింపు
  • టెంపరరీ సెక్రటేరియెట్ లోమరమ్మతులకు కోట్లలో ఖర్చు
  • పీఎంజీఎస్ వై గ్రాంట్లు వాడుకుంటున్న ప్రభుత్వం
  • తాజాగా రూ.15 లక్షలు విడుదల చేస్తూ ఉత్తర్వులు

టెంపరరీ సెక్రటేరియెట్ (బీఆర్కే భవన్)లో మరమ్మతులకు ప్రభుత్వం కోట్లు ఖర్చు చేస్తోంది. ఇప్పటికే రూ.20 కోట్లకు పైగా ఖర్చు చేసిన ప్రభుత్వం… మరిన్ని నిధులూ విడుదల చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. అది కూడా రోడ్లు వేసేందుకు వాడుకోవాల్సిన నిధులను ఇటు మళ్లిస్తోంది. ప్రధానమంత్రి గ్రామ సడఖ్ యోజన (పీఎంజీఎస్ వై )గ్రాంట్లలోని రూ.15 లక్షలను… బీఆర్కే భవన్ లోని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆఫీసుల్లో రిపేర్లు, రినోవేషన్ కు కేటాయిస్తూ ఇటీవల జీవో జారీ చేసింది. వీటితో మీటింగ్ హాల్, వీడియో కాన్ఫరెన్స్ హాల్ లో రిపేర్లు చేయనుంది. కొత్త సెక్రటేరియెట్ నిర్మాణంలో భాగంగా పోయినేడాది ఆగస్టులో బీఆర్కే భవన్ కు అన్ని శాఖలను తరలిం చారు. ఇందులో రిపేర్లు, రినోవేషన్లకు ఇప్పటికే రూ.20 కోట్లకు పైగా ఖర్చు చేశారు. ప్రస్తుతం బీఆర్కే భవన్ లోని టెర్రస్ పై రూ.3 కోట్లతో కాన్ఫరెన్స్ హాల్, అందుకు ప్రత్యేకంగా లిఫ్టు నిర్మా ణం చేస్తున్నారు . ఇటీవల ప్రభుత్వం ఐఏఎస్ లను బదిలీ చేయడంతో చాలా శాఖలకు కొత్త బాస్ లు వచ్చారు . దీంతో వారు తమ చాంబర్లలో వాస్తు, ఇతర అవసరాలకు అనుగుణంగా మరమ్మతులు చేయిస్తున్నారు. ఇప్పటి వరకు ఖాళీగా ఉన్న ఓ కీలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పోస్టులో నియమితులైన అధికారి.. ఆయన చాంబర్ లో మరమ్మతులు చేయిస్తున్నారు. ఆర్థిక మాంద్యం, నిధులుకొరత కారణంగా ఖర్చులు తగ్గించుకోవాలని సీఎం కేసీఆర్ చెబుతుండగా… అధికారులు మాత్రం ఇలాభారీగా నిధులు వృథా చేయడం గమనార్హం.

అట్ల ఎట్ల వాడుతరు?

రాష్ట్రంలో 12,751 గ్రామాలు ఉండగా, చాలా గ్రామాలకు రోడ్డు సౌకర్యమే లేదు. కొత్తగా సుమారు 3వేల తండాలు గ్రామ పంచాయతీలుగా ఏర్పడ్డాయి. వీటిలో చాలా వాటిల్లో మట్టి రోడ్లే ఉన్నాయి. రోడ్ల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం పీఎంజీఎస్ వైస్కీమ్ కింద రూ.వందలాది కోట్లను ఏటా మంజూరు చేస్తోంది. కానీ ప్రభుత్వం ఈ నిధులను ఇతర అవసరాలకు వాడుకుంటోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. వివిధ పథకాలకు కేంద్ర నిధులిస్తుంటే వాటిని సక్రమంగా వినియోగించడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. ‘గ్రామీణ ప్రాంతాలకు రోడ్డు సౌకర్యం కల్పించేందుకు కేంద్రం పీఎంజీఎస్ వై స్కీమ్ తీసుకొచ్చింది. ఈ నిధులను బీఆర్కే భవన్ రిపేర్లకు ఎలా ఉపయోగిస్తరు ? ఇప్పటికే కోట్ల రూపాయలను బీఆర్కే మరమ్మతుల కోసం ఖర్చు చేశారు. ఓవైపు నిధుల కొరత, ఆర్థిక మాంద్యం తో ఖర్చులు తగ్గించుకోవాలని సీఎం కేసీఆర్ చెబుతుంటే అధికారులేమో పట్టిం చుకోవడం లేదు” అని బీఆర్కే భవన్ లో పని చేస్తున్న ఓ అధికారి చెప్పారు.