హైదరాబాద్, వెలుగు: రోడ్డు ప్రమాదాల నివారణ కోసం రాష్ట్ర పోలీసులు వినూత్న కార్యక్రమాన్ని రూపొందించారు. రిటైర్డ్ టీచర్స్, మహిళలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు సభ్యులుగా గ్రామాల్లోనే రోడ్ సేఫ్టీ కమిటీల ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. రాష్ట్రంలో మొత్తం 29,583 కిలో మీటర్ల విస్తీర్ణంలో వివిధ రహదారులు ఉన్నాయి. ఇందులో 4,983 కిలో మీటర్ల మేర హైవేలు,1,687 కిలో మీటర్లు స్టేట్ హైవేలు, 32,913 కిలో మీటర్లు జిల్లా, గ్రామీణ రహదారులు ఉన్నాయి. వాటిలో తరచూ రోడ్డు ప్రమాదాలు జరిగే హాట్ స్పాట్‌లను పోలీసులు గుర్తించారు. జిల్లా కలెక్టర్లు, రోడ్లు భవనాలు సహా సంబంధిత శాఖల అధికారులు, స్వచ్ఛంద సంస్థల సమన్వయంతో ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని సూచించారు. 108 సహా జిల్లా అధికారుల పనితీరుపై కూడా సమీక్షించాలని పేర్కొన్నారు.
మృతుల్లో బైకర్లే ఎక్కువ
రాష్ట్రంలో 2020 సంవత్సరంలో 19,172 రోడ్డు ప్రమాదాలు జరగగా.. 2,882 మంది మృతి చెందారు. 2021లో జరిగిన 21,315 ప్రమాదాల్లో 7,557 మంది మృతి చెందగా, గతేడాది 21,619 ప్రమాదాల్లో 7,559 మంది చనిపోయారు. ఇందులో 53 శాతం ద్విచక్ర వాహనాలే ప్రమాదానికి గురయ్యాయని పోలీసులు గుర్తించారు. 2021లో 4,082 మంది బైకర్లు మరణించగా.. గతేడాది 3,977 మంది మృతి చెందినట్లు వివరించారు. గత రెండేండ్లతో పోల్చితే ఈ ఏడాది మార్చి వరకు రోడ్డు ప్రమాదాల సంఖ్య, మరణాలు గణనీయంగా తగ్గాయని వెల్లడించారు.
ప్రజల్లో అవగాహన కల్పించాలి : డీజీపీ
గ్రామాల్లో రోడ్ సేఫ్టీ కమిటీల ఏర్పాటుపై డీజీపీ అంజనీకుమార్ గురువారం సీపీలు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇతర నేరాలతో పోల్చితే రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందుతున్న వారి సంఖ్య అధికంగా ఉందని ఆయన తెలిపారు. ఇందుకోసం గ్రామస్థాయిలో ప్రత్యేక కమిటీలు ఏర్పాటుచేసి.. ప్రమాదాల నివారణపై ప్రజల్లో చైతన్యం, అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీజీలు శివధర్ రెడ్డి, సంజయ్ కుమార్ జైన్, రోడ్ సేఫ్టీ వింగ్ ఎస్పీ రాఘవేందర్ రెడ్డి సహా ఐజీలు పాల్గొన్నారు.