V6 News

రహదారి భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

రహదారి భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

నకిరేకల్, వెలుగు:   రహదారి భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్​ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘అరైవ్​ అలైవ్’  కార్యక్రమంలో భాగంగా బుధవారం నకిరేకల్ మినీ స్టేడియంలో రహదారి భద్రతపై భారీ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ హెల్మెట్, సీట్ బెల్ట్ లాంటి నియమాలను విధిగా పాటించాలని పిలుపునిచ్చారు.  పోలీసు అధికారులు రహదారి భద్రతపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి జాతీయ రహదారులు, ఇతర రహదారులపై అతివేగంతో వెళ్లే వాహనాలను నియంత్రించేందుకు పెట్రోలింగ్ పెంచాలన్నారు. 

ఈ విషయంపై అందరికీ అవగాహన కల్పిస్తే రహదారి ప్రమాదాలు తగ్గుతాయన్నారు. అండర్ పాస్ రహదారుల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపాలని సూచించారు. రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఏటా హత్యల కంటే రోడ్డు ప్రమాదాల్లో చనిపోయే వారి సంఖ్య ఎక్కువ ఉందని, సుమారు 7,500 మంది రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్నారని, ఇందులో 65 శాతం పాదచారులు, ద్విచక్ర వాహనదారులేనని  వెల్లడించారు. నల్గొండ కలెక్టర్ బి. చంద్రశేఖర్, ఎస్పీ శరత్ చంద్ర పవార్,  రాష్ట్ర డైరీ డెవలప్​మెంట్ చైర్ పర్సన్ గుత్తా అమిత్ రెడ్డి, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు రహదారి భద్రతపై ప్రజలకు దిశానిర్దేశం చేశారు.