మార్చి15న రోడ్లు దిగ్భందం చేస్తం : మందకృష్ణ

మార్చి15న రోడ్లు దిగ్భందం చేస్తం : మందకృష్ణ

ఎమ్మార్పీఎస్ వర్గీకరణలో బీజేపీ చేసిన మోసానికి నిరసనగా మార్చి15న రెండు తెలుగు రాష్ట్రాల జాతీయ రహదారులను దిగ్భందం చేస్తామని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ పిలుపునిచ్చారు. ఎస్సీల వర్గీకరణలో నెంబర్ వన్ దోషి బీజేపీనేనని ఆరోపించారు. వర్గీకరణ చేస్తామని హామీ ఇచ్చి, మోసం చేసింది కూడా బీజేపీనే అని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ చేపట్టిన ప్రజా భరోసా యాత్ర ఎస్సీలకు ఏ మాత్రం భరోసా ఇవ్వలేదని, ఇక తెలంగాణ ప్రజలకు ఏం భరోసా ఇస్తారంటూ మందకృష్ణ ఎద్దేవా చేశారు. మార్చి 15న ఎస్సీల వర్గీకరణ కోసం  హైదరాబాద్, విజయవాడ రెండు రహదారులపై నిరసనలు చేపడతామని చెప్పారు. ఈ నెల 22 నుండి మార్చి14 వరకు అన్ని మండలాల నుండి రాష్ట్ర రాజధాని వరకు పాదయాత్ర చేస్తామని స్పష్టం చేశారు. అనాథ పిల్లలకు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని మంత్రుల నియోజకవర్గాల్లో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నిరసన దీక్షలు చేస్తామని మందకృష్ణ తెలిపారు. బడ్జెట్ లో రూ.3 లక్షల కోట్లు  కేటాయించారని చెప్తున్నారు గానీ.. రూ.3కూడా కేటాయించలేదని ఆరోపించారు.