ఏటీఎం సెంటర్ ను పేల్చేసి డబ్బులతో పరార్

ఏటీఎం సెంటర్ ను పేల్చేసి డబ్బులతో పరార్

పుణె: మహారాష్ట్రలోలని పుణె నగరంలో దొంగలు తెగబడ్డారు. అర్ధరాత్రి 1 గంట సమయంలో ఏటీఎం కేంద్రాన్ని పేలుడు పదార్థాలతో పేల్చేసి రూ.30 లక్షల నగదు తీసుకుని ఉడాయించారు. పేలుడు ధాటికి ఏటీఎం మిషన్ బద్దలు కాగా దొరికిన 30 లక్షలు తీసుకున్న దుండగులు మరొక ర్యాక్ లో 10 లక్షలు ఉన్నా.. సమయంలేక వాటిని అలాగే వదిలేసి వెళ్లిపోయారు. పుణె నగరంలోని పింప్రి చించ్ వాడ్ ప్రాంతంలో  ఈనెల 18వ తేదీ అర్ధరాత్రి జరిగిన ఘటనను పోలీసులు ధృవీకరించారు. శక్తివంతమైన పేలుడు పదార్థాలు ఉపయోగించడంతో యాంటి టెర్రరిజం స్క్వాడ్ బృందం రంగంలోకి దిగి పేలుడు పదార్థాలు ఎలా ఉపయోగించారు.. ఏంతమేర ఉపయోగించారన్నది తేల్చేపనిలో ఉన్నారు. దీని కోసం ఎన్.ఐ.ఏ నిపుణులతోపాటు డాగ్ స్క్వాడ్ తోను తనిఖీలు చేయించారు.

ఏటీఎం మిషన్ బద్దలైందంటే చాలా శక్తివంతమైన పేలుడు పదార్థాలు ఉపయోగించినట్లు అర్థమవుతోందని.. దేశంలో ఇలాంటి ఘటన ఇదే తొలిసారి కావొచ్చని పింప్రిచించ్ వాడ్ డిప్యూటీ పోలీసు కమిషనర్ చంపక్ ఇప్పర్ వెల్లడించారు. నిందితులు హడావుడిగా పేల్చేసి దొరికిన 30 లక్షలు తీసుకుని పరారయ్యారని.. మరో 10 లక్షలు ఉన్నా ఆ డబ్బును తీసుకెళ్లే సమయం లేక హడావుడిగా పారిపోయినట్లు అర్థమవుతోందన్నారు. నిందితుల కోసం గాలింపు చేపట్టామన్నారు. కొద్ది రోజుల క్రితం పుణె రూరల్ ఏరియా పరిధిలోని రాజన్ గ్రామం వద్ద ఏటీఎం కేంద్రాన్ని పేల్చేసేందుకు ఇదే తరహాలో ప్రయత్నించారని ఆయన గుర్తు చేశారు. అయితే అక్కడ ఏటీఎం మిషన్ ఓపెన్ కాలేదని.. ఇక్కడ మాత్రం ఓపెన్ అయిందంటే.. అక్కడ ప్రయత్నించి విఫలమైన వారే ఇక్కడ కూడా ప్రయత్నించారా..? అన్న అనుమానాలు కలుగుతున్నాయన్నారు. ఘటనపై చాలా సీరియస్ గా విచారణ చేపట్టామని ఆయన తెలిపారు.