సైబర్ దొంగలు సచ్చినోళ్లనీ వదుల్తలేరు

సైబర్ దొంగలు సచ్చినోళ్లనీ వదుల్తలేరు

బతికున్నవాళ్లను మోసం చేస్తే ఏదో ఒక రోజు బయటపడి దొరికిపోతామని గుంటూరుకు చెందిన ఓ సైబర్ ​గ్యాంగ్ ​కొత్తరకం మోసానికి తెరలేపింది. చనిపోయిన కొందరు సాఫ్ట్​వేర్ ​ఎంప్లాయీస్​ వివరాలు సంపాదించి ఫేక్​ ఐడీ కార్డులు తయారు చేసింది. వాళ్ల పేర్లతో క్రెడిట్ కార్డులు, బ్యాంక్​ లోన్స్ ​తీసుకుంది. దీని కోసం సైబర్ ​క్రిమినల్స్ ​బ్యాంక్ ఉద్యోగులుగా, కొరియర్ బాయ్స్ గా అవతారమెత్తారు. చివరికి రికవరీ ఏజెంట్లు ఇంటికొచ్చి ప్రశ్నించడంతో విషయం బయటపడింది.

హైదరాబాద్, వెలుగు: ప్రమాదాల్లో చనిపోయిన సాఫ్ట్ వేర్ ఉద్యోగులే టార్గెట్.. వాళ్ల ఫోన్ నంబర్స్, ఇతర వివరాలు సేకరిస్తారు.. మృతుల పేర్లతో ఫేక్ ఐడీ కార్డులు, వాళ్ల నంబర్​తోనే సిమ్ కార్డులు, డాక్యుమెంట్లను తయారు చేస్తారు. తర్వాత వారి పేర్లతో క్రెడిట్ కార్డులు, బ్యాంక్ లోన్స్ తీసుకుంటారు. రూ.కోట్లు కొళ్లగొడతారు. ఆన్ లైన్​లో అందిన కాడికి దోచుకుంటారు. ఇలా వరుస సైబర్ నేరాలకు పాల్పడుతున్న ఆరుగురు సభ్యుల ముఠాను సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. కేసు వివరాలను సైబర్ క్రైమ్ ఏసీపీ శ్రీనివాస్ కుమార్, డీసీపీ రోహిణి ప్రియదర్శిణితో కలిసి సీపీ సజ్జనార్ వెల్లడించారు.

గుంటూరు ఫణి చౌదరి గ్యాంగ్

గుంటూరు జిల్లా గొట్టిపాడుకు చెందిన నిమ్మగడ్డ ఫణి చౌదరి (33) ఇంటర్ వరకు చదువుకున్నాడు. కొంతకాలం ఒంగోలు ఆర్టీఏలో డేటా ఎంట్రీ ఆపరేటర్ గా పనిచేశాడు. ఈ క్రమంలో ఫేక్ ఓటర్ కార్డులు, పాన్ కార్డులు, డ్రైవింగ్ లైసెన్స్ లు, ఫేక్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు తయారు చేయడం నేర్చుకున్నాడు. తర్వాత హైదరాబాద్ వచ్చాడు. ఫేక్ డాక్యుమెంట్స్ తయారు చేస్తూ 2011లో మాదన్న పేట్ పోలీసులకు, 2012లో సిటీ సీసీఎస్ పోలీసులకు పట్టుబడ్డాడు. దీంతోపాటు చైతన్యపురిలో ఇల్లీగల్ కాల్ రూటింగ్ సెంటర్ నిర్వహిస్తూ గతేడాది జూన్ లో రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులకు పట్టుబడ్డాడు. తర్వాత గుంటూరుకు చెందిన తన ఫ్రెండ్స్ మాదవ స్వరూప్ (34), పెదవల్లి శ్రీనివాస రావు (33) కండ్రు హరీశ్ (25) నార్నే వేణుగోపాల్ (35) ఇక్కుర్తి వీరశేఖర రావు (28)తో కలిసి గ్యాంగ్ ఏర్పాటు చేశాడు. 2016లో కేపీహెచ్​బీలోని ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డులతో రూ.47 లక్షలు, చైతన్యపురిలోని హెచ్​డీఎఫ్​సీ క్రెడిట్ కార్డులతో రూ.44 లక్షలు కొట్టేశాడు.

చనిపోయిన సాఫ్ట్ వేర్ ఉద్యోగుల డేటా సేకరించి

హైదరాబాద్ ఐటీ కంపెనీల్లో పని చేసే ఉద్యోగులకు బ్యాంకులు అందించే ఆన్ లైన్ క్రెడిట్ కార్డులను, బ్యాంక్ లోన్స్ ను కొట్టేసేందుకు ఫణి ముఠా ప్లాన్ చేసింది. ఇందుకు ప్రమాదాల్లో చనిపోయిన సాఫ్ట్ వేర్ ఉద్యోగుల వివరాలను సేకరించడం ప్రారంభించింది. ఆ ఉద్యోగుల ఫోన్ నంబర్స్ ను సోషల్ మీడియాలో, వాళ్ల ఆఫీసులు, ఇండ్లకు వెళ్లి సేకరించింది. వాటితో ఫేక్ ఐడీ కార్డులు, డాక్యుమెంట్లు క్రియేట్ చేసి క్రెడిట్ కార్డులు, బ్యాంకు లోన్స్ తీసుకోవడం ఫణి చౌదరి గ్యాంగ్ ప్రారంభించింది. గోదావరి బోట్ ప్రమాదంలో మృతి చెందిన రేపాకుల విష్ణు కుమార్, నల్లకుంట ఐడీఎల్ లేక్ లో మృతి చెందిన అవకాశ్ మహంత, ఆత్మహత్య చేసుకున్న ఇన్ఫోసిస్ ఎంప్లాయ్ పాలపర్తి రఘురాం, యాక్సిడెంట్ లో చనిపోయిన పెగా కంపెనీ ఉద్యోగి అభిషేక్ ఆనంద్ పేర్లతో.. కండ్రు హరీశ్, నార్నే వేణుగోపాల్ ఫొటోలతో నకిలీ ఐడీ కార్డులు తయారు చేశారు. న్యూస్ పేపర్లు, టీవీల్లో వచ్చే సాఫ్ట్ వేర్ ఎంప్లాయిస్ డెత్స్ వివరాల ఆధారంగా వాళ్ల ఆఫీసులకు బ్యాంక్ ఉద్యోగులుగా, కొరియర్ బాయ్స్ గా వెళ్లి నమ్మించేవారు. మృతుల బ్యాంక్ అకౌంట్స్ తో లింక్ అయిన ఫోన్ నంబర్లతో సిమ్ కార్డులు తీసుకునే వారు. సంబంధిత సిమ్ కంపెనీలకు ఫోన్ చేసి, తమ ఫోన్ పోయిందని, సిమ్ బ్లాక్ చేయాలని చెప్పి.. తర్వాత అదే నంబర్​తో సిమ్ తీసుకునేవారు.

బాధితుల ఫిర్యాదుతో..

రికవరీ ఏజెంట్లు ఇంటికి వచ్చి ప్రశ్నిచండంతో విష్ణు కుమార్ భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. అలాగే ఇన్ఫోసిస్ ఎంప్లాయ్ రఘురాం క్రెడిట్ కార్డ్ మిస్​యూజ్ అవుతోందని మరో ఫిర్యాదు కూడా అందింది. దీంతో పోలీసులు ఈ రెండు కేసులను ప్యార్​లల్​గా ఇన్వెస్టిగేట్ చేశారు. టెక్నికల్ ఎవిడెన్స్ సేకరించి నిందితులను గచ్చిబోలి పట్టుకున్నారు. గతంలో ఇలాంటి కేసుల్లో ఏ1 నిందితుడిగా ఉన్న ఫణిని అదుపులోకి తీసుకున్నారు.

మరిన్ని వార్తల కోసం