
- పోప్ లియో 14గా పేరు మార్పు
- మొదటి అమెరికన్ పోప్‌గా రికార్డ్
వాటికన్ సిటీ: కాథలిక్ చర్చి 267వ పోప్‌గా అమెరికాకు చెందిన రాబర్ట్ ఫ్రాన్సిస్ ప్రెవోస్ట్(69) గురువారం ఎన్నికయ్యారు. అనంతరం ఆయన పోప్ లియో14 అనే పేరును స్వీకరించారు. అమెరికా నుంచి మొట్టమొదటిసారి పోప్‌గా ఎన్నికైన వ్యక్తిగా ప్రెవోస్ట్ రికార్డ్ క్రియేట్ చేశారు. కొత్త పోప్ ఎన్నిక ఖరారుకు సూచనగా వాటికన్ లోని ప్రాచీన సిస్టన్ చాపెల్ చర్చి పొగ గొట్టం నుంచి తెలుపు రంగు పొగ వెలువడింది. దీంతో ప్రజల హర్షధ్వానాలతో సెయింట్ పీటర్స్ స్క్వేర్ హోరెత్తింది.
సిస్టీన్ చాపెల్ పైభాగంలోని చిమ్నీ నుంచి తెల్లటి పొగ ఎగసిపడిన దాదాపు 70 నిమిషాల తర్వాత 100 కోట్లక పైగా సభ్యులున్న కాథలిక్ చర్చికి 133 కార్డినల్ ఎలక్టర్లు కొత్త పోప్‌ను ఎన్నుకున్నారు.69 ఏండ్ల ప్రెవోస్ట్.. ఇల్లినాయిస్‌లోని చికాగోలో జన్మించారు. 2023 నుంచి వాటికన్‌లోని డికాస్టరీ ఫర్ బిషప్స్ ప్రిఫెక్ట్‌గా, పాంటిఫికల్ కమిషన్ ఫర్ లాటిన్ అమెరికా అధ్యక్షుడిగా సేవలు అందిస్తున్నారు.
ప్రపంచవ్యాప్తంగా బిషప్‌ల నియామకాలను పర్యవేక్షించే కీలక బాధ్యతను నిర్వర్తించారు. పెరూలో దశాబ్దాల పాటు మిషనరీగా, పారిష్ ప్రేయర్ గా , బిషప్‌గా సేవలందించిన ప్రెవోస్ట్.. అమెరికా, పెరూ ద్వంద్వ పౌరసత్వాన్ని కలిగి ఉన్నారు. ఇది ఆయన అంతర్జాతీయ దృక్పథాన్ని ప్రతిబింబిస్తున్నది.