ప్రియాంకా ఎంపీ కావాలె.. ఆ పదవికి ఆమె అర్హురాలు

ప్రియాంకా ఎంపీ కావాలె.. ఆ పదవికి ఆమె అర్హురాలు
  • ప్రియాంకకు సముచిత స్థానం కల్పించాలని కాంగ్రెస్​కు సూచన 
  • అదానీతో ఫొటోపై స్మృతి ఇరానీ కామెంట్లకు కౌంటర్

న్యూఢిల్లీ: కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీపై ఆమె భర్త రాబర్ట్ వాద్రా ప్రశంసల వర్షం కురిపించారు. ప్రియాంక పార్లమెంట్​లో ఉండాల్సిన వ్యక్తి అని మెచ్చుకున్నారు. ప్రముఖ వార్తా సంస్థ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. ‘‘ప్రియాంక లోక్ సభలో ఉండాల్సిన వ్యక్తి. ఆమెకు అన్ని అర్హతలు ఉన్నాయి. ప్రియాంక పార్లమెంట్ లో ఉంటే బాగుంటుంది. కాంగ్రెస్ పార్టీ ఆమెకు సముచిత స్థానం కల్పిస్తుందని ఆశిస్తున్నాను” అని వాద్రా అన్నారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి స్మృతి ఇరానీపై వాద్రా మండిపడ్డారు. గౌతమ్ అదానీతో తాను దిగిన ఫొటోను పార్లమెంట్ లో చూపించి స్మృతి ఇరానీ కామెంట్లు చేశారని వాద్రా చెప్పారు. ‘‘అదానీతో కలిసి ఫొటో దిగితే తప్పేంటి? నేను ఏదైనా తప్పు చేశానా? అదేంటో నిరూపించండి” అని ఆయన సవాల్ విసిరారు. లేదంటే తనపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అదానీ విమానంలో ప్రధాని మోదీ ప్రయాణించిన ఫొటోలు తమ వద్ద ఉన్నాయని, మరి దానికేం జవాబు చెబుతారని ప్రశ్నించారు. ‘‘ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నాపై ఏదో ఒక ఆరోపణ చేస్తున్నారు. కానీ వాళ్లు ఒక్కటి కూడా నిరూపించలేకపోయారు” అని అన్నారు.  

ఎన్డీయేకు ‘ఇండియా’ గట్టి పోటీ ఇస్తది.. 

2024 లోక్ సభ ఎన్నికల్లో ఎన్డీయేకు కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ఇండియా కూటమి గట్టి పోటీ ఇస్తుందని రాబర్ట్ వాద్రా ధీమా వ్యక్తం చేశారు. ‘‘కూటమికి ఇండియా పేరు చాలా బాగుంది. బీజేపీ ప్రభుత్వం ఇండియాను నాశనం చేసింది. ఇండియాను మళ్లీ గొప్పగా, సెక్యులర్ గా మార్చడానికి, అభివృద్ధి పథంలో నడిపించడానికి, ఒక్కటిగా చేయడానికి.. ఇండియా కూటమికి ప్రజలు అవకాశం ఇస్తారని ఆశిస్తున్నాను” అని చెప్పారు.