- మెట్రో వాటర్ బోర్డు ప్రత్యేక యాక్షన్ ప్లాన్
- వాటర్ పొల్యూషన్ ఫ్రీ సిటీ హైదరాబాదే లక్ష్యం
- త్వరలో పాత లైన్ల మార్పు కూడా..
- సమీక్ష సమావేశంలో ఎండీ అశోక్ రెడ్డి వెల్లడి
హైదరాబాద్‌సిటీ, వెలుగు: హైదరాబాద్ మహానగర పరిధిలో తాగునీటి కాలుష్యం, సరఫరా సమస్యలను తొలగించడానికి మెట్రో వాటర్ బోర్డు అధికారులు వినూత్న ఆలోచన చేశారు. రోబోటిక్ టెక్నాలజీతో కలుషిత నీటి సరఫరాను గుర్తించి, ప్రజలకు ఇబ్బందులు లేకుండా వాటర్ పొల్యూషన్ ఫ్రీ సిటీగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దడానికి ప్రత్యేక యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారు. కలుషిత నీటి ఫిర్యాదులను ‘జీరో’కు తగ్గించడానికి తీసుకోవాల్సిన చర్యలపై ఎండీ అశోక్ రెడ్డి సంబంధిత అధికారులతో శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వివిధ కారణాలతో ప్రతిరోజూ కలుషిత నీటి ఫిర్యాదులు వస్తున్నాయని, అధికారులు వెంటనే స్పందించి సమస్యలను పరిష్కరించాలని తెలిపారు. మెట్రో కస్టమర్ కేర్ (ఎంసీసీ)లో ఏ ప్రాంతాల నుంచి అధిక ఫిర్యాదులు వస్తున్నాయో సమాచారం సేకరించి సమస్య మూలాలను విశ్లేషించాలని ఆదేశించారు. రెండేళ్ల ఫిర్యాదులపై విశ్లేషణ చేసి అధికంగా నీటి కాలుష్యంపైనే ఫిర్యాదులు ఉన్నట్లు గుర్తించారు.
కాలం చెల్లిన పైప్ లైన్ల స్థానంలో కొత్తవి
అలాగే డివిజన్ల వారీగా కాలం చెల్లిన పైప్ లైన్ల వివరాలు, కలుషిత నీరు ఫిర్యాదులు ఎక్కువ వచ్చే ప్రాంతాల్లోని పైప్ లైన్ల వివరాలు సేకరించాలన్నారు. తద్వారా ఆ ప్రాంతాల్లో పైపు లైన్ల పటిష్టతను అంచనా వేసి మార్చడానికి ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలన్నారు. కాలం చెల్లిన పైప్ లైన్ల స్థానంలో కొత్తవి నిర్మాణం చేయడానికి ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించారు.
ఈ పనులు పూర్తి చేయడానికి సరైన కార్యాచరణ వెంటనే సమర్పించాలని కోరారు. రానున్న రెండు నెలల్లో పైప్ లైన్ పునర్నిర్మాణ పనులు పూర్తి చేయడానికి సిద్ధం కావాలని సూచించారు. దానికి సంబంధించిన కొత్త పైప్ లైన్ నిర్మాణ అంచనాలు వెంటనే సమర్పించి ఆమోదం పొందాలని తెలిపారు.
ఎలా పనిచేస్తుందంటే..?
ఇప్పటివరకు కలుషిత నీరు కనిపెట్టేందుకు అధికారులు ఆయా ప్రాంతాల్లో పైప్ లైన్లను తవ్వి పరిశీలిస్తున్నారు. దీని వల్ల ఎంతో సమయం, మ్యాన్‌పవర్, ఖర్చు పెరుగుతోంది. తాజాగా రోబోటిక్టెక్నాలజీతో కలుషిత నీరు, లీకేజీలు అరికట్టడానికి చర్యలు తీసుకుంటున్నట్టు అశోక్‌రెడ్డి తెలిపారు. ఇందుకోసం రోబోటిక్ టెక్నాలజీతో పనిచేసే పొల్యూషన్ ఐడెంటిఫికేషన్ మెషిన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినట్టు చెప్పారు.
ఈ యంత్రాన్ని పైప్ ఇన్స్పెక్షన్ కెమెరా సిస్టమ్ అని కూడా అంటారు. కలుషిత నీటి సరఫరా జరుగుతున్న ప్రాంతాల్లోని పైప్లైన్లోకి ఈ కెమెరా కలిగిన యంత్రాన్ని వదులుతారు. దీంతో పైప్‌లైన్‌లో ఉన్న కలుషిత నీటిని, అందులో ఉన్న కలుషిత పదార్థాలు కంప్యూటర్మానిటర్ పై స్పష్టంగా కనిపిస్తుంది. దీంతో వెంటనే సమస్యను పరిష్కరించడానికి అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు.
