భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు పటిష్ట బందో బస్తు ఏర్పాటు చేస్తున్నామని ఎస్పీ బి.రోహిత్రాజు తెలిపారు. కొత్తగూడెంలోని ఎస్పీ ఆఫీస్‌లో పోలీస్అధికారులతో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్‌తోపాటు ఇల్లెందు, అశ్వారావుపేట మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరుగనున్నట్లు పేర్కొన్నారు.
288 పోలింగ్ కేంద్రాల్లో 125 సెన్సిటీవ్, 15 క్రిటికల్ కేంద్రాలను గుర్తించామన్నారు. ఎనిమిది ఫ్లయింగ్‌స్క్వాడ్, నాలుగు స్టాటిక్సర్వేలయన్స్ బృందాలు ఏర్పాటు చేశామని చెప్పారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఓటర్లకు ప్రలోభాలకు గురిచేసే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. సమావేశంలో డీఎస్పీలు ఆదినారాయణ, సతీశ్ కుమార్, వెంకన్న బాబు పాల్గొన్నారు.
