మహారాష్ట్రకు ఏనుగు.. అయినా జాగ్రత్తగా ఉండాలి

మహారాష్ట్రకు ఏనుగు.. అయినా జాగ్రత్తగా ఉండాలి

మూడు రోజుల పాటు హడలెత్తించి ఇద్దరి ప్రాణాలను తీసిన ఏనుగు ప్రాణహిత నదిని దాటి మహారాష్ట్రలోని చిన్నవట్ర ప్రాంతానికి వెళ్లింది. నది ఒడ్డున ఉన్న ఓ మత్స్యకారుడి కోళ్లగూడును, ఓ గుడిసెను ధ్వంసం చేసింది.

కాగజ్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌, వెలుగు: మూడు రోజుల పాటు హడలెత్తించి రెండు ప్రాణాలను బలిగొన్న ఏనుగు ప్రాణహిత నదిని దాటి మహారాష్ట్రలోని చిన్నవట్ర ప్రాంతానికి వెళ్లింది. ఈ విషయాన్ని జిల్లా ఫారెస్ట్  ఆఫీసర్లు నీరజ్  కుమార్, టిబ్రే వాల్  ధ్రువీకరించారు. ఏనుగు ప్రాణహిత నదిని దాటే క్రమంలో నది ఒడ్డున ఉన్న గంగాధర్  అనే  మత్స్యకారుడికి చెందిన కోళ్లగూడును తొక్కడంతో ఒక కోడిపుంజు చనిపోయింది. అక్కడే  షెల్టర్ కోసం వేసుకున్న ఓ పందిరిని కూడా ఏనుగు ధ్వంసం చేసింది. ఆ సమయంలో మత్స్యకారుడు అక్కడ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. కాగా, శుక్రవారం రాత్రి చింతలమానేపల్లి మండలం దిందా గ్రామ శివారులో ఏనుగు వచ్చిందన్న వార్తల్లో నిజం లేదని అధికారులు తెలిపారు. రాత్రి నుంచి ఉదయం వరకు ఆ గ్రామం సమీపంలో ఏనుగు అడుగుల కోసం వెతకగా ఏమీ దొరకలేదని తేల్చారు. అలాగే మహారాష్ట్ర అధికారులతో కలిసి ఫారెస్ట్  ఆఫీసర్లు ఏనుగు దాటిన ప్రదేశాన్ని పరిశీలించి పగ్ మార్క్స్ ను గుర్తించారు.

మృతుల కుటుంబాలకు పరిహారం ఇప్పిస్తం

ఏనుగు దాడిలో ఇద్దరు చనిపోవడం బాధాకరమని, మృతుల కుటుంబాలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం పరిహారం వచ్చేలా చూస్తామని డీఎఫ్ఓ నీరజ్  కుమార్  తెలిపారు. శనివారం కాగజ్‌‌‌‌‌‌‌‌ నగర్‌‌‌‌‌‌‌‌  ఫారెస్ట్  డివిజన్  ఆఫీసులో డివిజన్ లోని ఫారెస్ట్  రేంజ్  ఆఫీసర్లు, డిప్యూటీ రేంజ్  ఆఫీసర్, సెక్షన్  అధికారులు, బీట్ ఆఫీసర్ లకు కోల్ కతాకు చెందిన సజే ఫౌండేషన్ ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. ఏనుగును ఎలా ఎదుర్కోవాలో శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో డీఎఫ్ఓ నీరజ్  కుమార్  మాట్లాడారు. ఏనుగు పక్క రాష్ట్రం అడవిలో ఉన్నా సరిహద్దు గ్రామాల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. ఏనుగు మరోసారి వస్తే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. కొండపల్లిలో మృతి చెందిన పోషన్న కుటుంబానికి పరిహారంతో పాటు ఐదెకరాల భూమి ఇప్పిస్తామన్నారు. ఈ మేరకు ప్రభుత్వానికి నివేదిక పంపుతామన్నారు. ఏనుగు సంచారం ఉన్నా, దాని ఆనవాళ్లు కనిపించినా వెంటనే ఫారెస్ట్  ఆఫీసర్లకు సమాచారం ఇవ్వాలని సూచించారు.

ఏనుగును మళ్లించడంలో అధికారులు సక్సెస్​: కొండా సురేఖ

ఆసిఫాబాద్‌‌‌‌‌‌‌‌ జిల్లాలో నాలుగు రోజుల పాటు ప్రజలను భయాందోళనలకు గురిచేసి, ఇద్దరి మరణానికి కారణమైన ఏనుగు తిరిగి మహారాష్ట్ర అడవుల్లోకి వెళ్లిందని అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు. ఏనుగును మహారాష్ట్ర వైపు మళ్లించడంలో రాష్ట్ర అటవీ శాఖ చేపట్టిన చర్యలు ఫలించాయన్నారు. అటవీ శాఖ అధికారులు ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేసి, అనుక్షణం అప్రమత్తతో వ్యవహరిస్తూ ఏనుగు జాడను కనిపెట్టుకుంటూ సురక్షితంగా దానిని దారి మళ్లించారని పేర్కొన్నారు. ఏనుగు మహారాష్ట్ర అడవుల్లో నుంచి తెలంగాణలోకి ప్రవేశించడం ఇదే మొదటిసారి అయినందున, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరిగితే అనుసరించాల్సిన కార్యాచరణ విషయంలో కచ్చితమైన ప్రణాళికలతో సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించామని వెల్లడించారు.