
ఇండియన్ సినీ ఇండస్ట్రీలో నటీనటుల పనివేళలు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె 8 గంటల పని షిఫ్ట్ డిమాండ్ వ్యవహారం ఇప్పుడు పెద్ద చర్చకే దారితీసింది. కొందరు మద్దతు ఇవ్వగా.. మరికొందరు ఆమె తీరును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. లేటెస్ట్ గా బాలీవుడ్ నిర్మాత, దర్శకుడు రోహన్ సిప్పీ ఈ అంశంపై రియాక్ట్ అయ్యారు. సినీ రంగంలో నిర్ణీత పనివేళలు సాధ్యం కావని తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు..
రోహన్ సిప్పీ ఘాటు వ్యాఖ్యలు
తాను దర్శకత్వం వహించిన లేటెస్ట్ షో 'సెర్చ్: ది నైనా మర్డర్ కేస్' ప్రమోషన్స్‌లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో రోహన్ సిప్పీ దీపికా పదుకొణెకు స్టాంగ్ కౌంటర్ ఇచ్చారు. మీరు 8 గంటల షిఫ్ట్ కోరుకుంటే, సినీ పరిశ్రమ సరైన వృత్తి కాదు అని స్పష్టం చేశారు. ఈ వృత్తి స్వభావం దృష్ట్యా, నటీనటులను కలవాలన్నా, సెట్‌లో ఉండాలన్నా లేదా రాత్రి షూటింగ్‌లు చేయాలన్నా కచ్చితంగా ఎక్కువ సమయం కేటాయించాల్సి ఉంటుందని తేల్చిచెప్పారు.
అంతేకాకుండా ఈ సినిమాల్లో పని చేయాలని కోరుకునేవారి సంఖ్య, డిమాండ్ కంటే చాలా ఎక్కువగా ఉంది అని సిప్పీ అన్నారు. సినీ పరిశ్రమలో పని దొరకడం అదృష్టంగా భావించాలని.. కాబట్టి ఆ వృత్తి డిమాండ్లను అంగీకరించక తప్పదని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ పనితీరును అర్థం చేసుకుని, సహకరించే కుటుంబం ఉండటం చాలా ముఖ్యమని, లేదంటే సమస్యలు తలెత్తుతాయని పేర్కొన్నారు. తనకి అలాంటి మద్దతు ఉండటం తన అదృష్టమని కూడా సిప్పీ తెలిపారు.
దీపికా పదుకొణె వాదన ఏంటి?
ఈ వివాదం మొదలవడానికి ప్రధాన కారణం.. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న 'స్పిరిట్' (Spirit), 'కల్కి 2898 AD' సీక్వెల్ 'కల్కి 2' వంటి భారీ ప్రాజెక్టుల నుంచి దీపికా తప్పుకోవడమే. దీనికి కారణం దీపికా రోజుకు కేవలం 8 గంటలు మాత్రమే పనిచేస్తానని, అలాగే అధిక రెమ్యూనరేషన్ డిమాండ్ చేశారని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది.
ఈ విమర్శలకు దీపికా ఇటీవల గట్టిగా బదులిచ్చారు. పరిశ్రమలో చాలా మంది అగ్ర హీరోలు సంవత్సరాలుగా రోజుకు 8 గంటలు మాత్రమే పనిచేస్తున్నారని, సోమవారం నుంచి శుక్రవారం వరకు మాత్రమే పనిచేస్తున్నారు. అంతే కాదు, వీకెండ్‌లో సెలవులు తీసుకుంటున్నారని, కానీ ఈ విషయం ఎప్పుడూ వార్తల్లోకి రాలేదని ఆమె ఆరోపించారు. కేవలం తాను తల్లి అయిన తర్వాతే ఈ డిమాండ్ చేయడంపై ద్వంద్వ ప్రమాణాలు ఎందుకు చూపిస్తున్నారని ప్రశ్నించారు. ఈ రంగాన్ని మరింత పద్ధతిగా, వ్యవస్థీకృతం చేయాల్సిన సమయం ఆసన్నమైందని దీపికా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
అయితే, దీపికా వాదనకు నటి జెనీలియా కొందరు మద్దతు ఇవ్వగా.. రానా దగ్గుబాటి, అడివి శేష్ వంటి తారలు ఇది 9-to-5 ఉద్యోగం కాదని, ప్రాజెక్టును బట్టి పనివేళలు మారతాయని తమ భిన్నమైన అభిప్రాయాలను వెల్లడించారు. మొత్తానికి, సినీ పరిశ్రమలో పని-జీవిత సమతుల్యతపై దీపికా మొదలుపెట్టిన ఈ చర్చ ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు.