పుట్టింటి నుంచి వెళ్తున్నట్లుంది: కలెక్టర్ రోహిణి సింధూరి

 పుట్టింటి నుంచి వెళ్తున్నట్లుంది: కలెక్టర్ రోహిణి సింధూరి

మైసూరు: కరోనా మహమ్మారి కాలంలో జిల్లాలో విశేష సేవలందించిన తెలుగుబిడ్డ రోహిణి సింధూరి బదిలీపై వెళ్తున్న సందర్భంగా ఎమోషన్ అయ్యారు. దేవాదాయ శాఖ కమిషనర్ గా బదిలీ అయిన ఆమె జిల్లా లో కలెక్టర్ గా వచ్చిన బగాది గౌతమ్ కు బాధ్యతలు అప్పగింతలు పూర్తి చేసి వెళ్తున్న సందర్భంగా మీడియాతో మాట్లాడారు. జిల్లాలోని పరిస్థితులు, పనుల వివరాలన్నీ కొత్త కలెక్టర్ గా వచ్చిన బగాది గౌతమ్ కు వివరించానని అన్నారు. తనపై ఆరోపణలు చేస్తూ మైసూరు మున్సిపల్ కమిషనర్ శిల్పానాగ్ తన ఉద్యోగానికి రాజీనామా ప్రకటించడంతో ఒకింత షాక్ కు గురయ్యానని.. చెప్పిన ఆమె అభద్రతా భావంతో ఆమె అలా చెప్పి ఉంటుందని.. తన తప్పేమి లేదని.. చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల ఇలా జరిగిందన్నారు. 
మన తెలుగమ్మాయి అయిన రోహిణి సింధూరి తనపై ఆరోపణలు వచ్చిన వెంటనే ఉన్నతాధికారులతోపాటు సీఎం యడియూరప్ప తదితరులను కలసి వివరణ ఇచ్చుకున్నప్పటికీ ఆమె బదిలీని రద్దు చేయని విషయం తెలిసిందే. అలాగే శిల్పా నాగ్ ను బదిలీ చేసి ఆమె స్థానంలో మైసూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా లక్ష్మికాంత్ రెడ్డిని నియమించారు. రోహిణి సింధూరి రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ గా బదిలీ చేయగా.. శిల్పా నాగ్ ను గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ ఈ గవర్నెన్స్ డైరెక్టర్ గా నియమించారు. తనపై వచ్చిన విమర్శల గురించి పెద్దగా చెప్పాల్సిందేమీ లేదంటూ.. శిల్పా నాగ్ అభద్రతా భావానికి గురై ఆరోపణలు చేయడం వల్ల తాను కొంత ఇబ్బందిపడింది వాస్తవమేనంటూ.. అయినా బదిలీలు ఉద్యోగులకు మామూలే కదా అంటూ నవ్వేశారు. మైసూరు జిల్లాలో తాను పనిచేసిన కాలం అంతా చిరకాలం జ్ఘాపకం ఉండిపోతుందని.. ఇక్కడి నుంచి వెళ్లిపోతుంటే పుట్టింటి నుంచి వెళ్లిపోతున్నట్లు ఉద్వేగంగా ఉందన్నారు.