IND vs ENG 5th Test: ఇంగ్లాండ్‌ను చితక్కొట్టారు: సెంచరీలతో చెలరేగిన రోహిత్, గిల్

IND vs ENG 5th Test: ఇంగ్లాండ్‌ను చితక్కొట్టారు: సెంచరీలతో చెలరేగిన రోహిత్, గిల్

ఇంగ్లాండ్ తో ధర్మశాలలో జరుగుతున్న టెస్టులో టీమిండియా భారీ స్కోర్ దిశగా దూసుకెళ్తుంది. కెప్టెన్ రోహిత్ శర్మ, యువ బ్యాటర్ శుభమాన్ గిల్  సెంచరీలతో విరుచుకుపడి ఇంగ్లీష్ జట్టుకు పట్టపగలే చుక్కలు చూపిస్తున్నారు. రెండో వికెట్ కు అజేయంగా 160 పరుగులు జోడించి మ్యాచ్ పై పట్టు బిగించారు.  రెండో రోజు లంచ్ సమయానికి భారత్ వికెట్ నష్టానికి 264 పరుగులు చేసింది. క్రీజ్ లో శుభమాన్ గిల్(101), రోహిత్ శర్మ (102) ఉన్నారు. ప్రస్తుతం భారత్ తొలి ఇన్నింగ్స్ లో 46 పరుగుల ఆధిక్యంలో ఉంది. చేతిలో 9 వికెట్లు ఉండడంతో ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ ఓటమి నుంచి తప్పించుకోవడం కష్టంగానే కనిపిస్తుంది. 

వికెట్ నష్టానికి 135 పరుగులతో రెండో రోజు ఆటను ప్రారంభించిన భారత్ కు రోహిత్ శర్మ, గిల్ ఇంగ్లాండ్ బౌలర్లను చితక్కొటేసారు. ఓ వైపు జాగ్రత్తగానే ఆడుతూ మారోవైపు వీలు చిక్కినప్పుడల్లా బౌండరీల వర్షం కురిపించారు. ఈ క్రమంలో గిల్, రోహిత్ తమ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. గిల్ 5 సిక్సర్లు, 10 ఫోర్లతో 137 బంతుల్లో టెస్ట్ కెరీర్ లో నాలుగో సెంచరీ పూర్తి చేసుకుంటే.. రోహిత్ శర్మ 3 సిక్సులు, 13 ఫోర్లతో 12 సెంచరీని నమోదు చేశాడు. ఈ సెషన్ లో పూర్తిగా భారత్ ఆధిపత్యం కొనసాగింది. 129 పరుగులతో ఇంగ్లాండ్ కు పీడకలను మిగిల్చింది.

అంతకముందు ఇంగ్లాండ్ తమ తొలి ఇన్నింగ్స్ లో 218 పరుగులకు ఆలౌటైంది. క్రాలే 79 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలవగా.. మిగిలిన ఏ ఒక్కరు కూడా 30 పరుగుల మార్క్ టచ్ చేయలేకపోయారు.ఒక దశలో వికెట్ నష్టానికి 100 పరుగులతో పటిష్టంగా కనిపించిన ఇంగ్లాండ్.. 118 పరుగుల వ్యవధిలో తమ చివరి 9 వికెట్లను కోల్పోయింది. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 5 వికెట్లు తీసుకొని ఇంగ్లాండ్ పతనాన్ని శాసించగా.. వందో టెస్ట్ ఆడుతున్న అశ్విన్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. జడేజాకు ఒక వికెట్ దక్కింది.