IND vs AFG: టీ20 చరిత్రలో ఒక్కడే: రోహిత్ ఖాతాలో అరుదైన రికార్డ్

IND vs AFG: టీ20 చరిత్రలో ఒక్కడే: రోహిత్ ఖాతాలో అరుదైన రికార్డ్

పరిమిత ఓవర్ల క్రికెట్ లో అసాధారణ ఆట తీరుతో అదరగొట్టే ప్లేయర్లలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఒకడు. ఓపెనర్ గా బరిలోకి దిగితే హిట్ మ్యాన్ విధ్వంసం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా టీ20 లంటే రోహిత్ కు పూనకం వచ్చినట్టు ఆడేస్తాడు. బ్యాటర్ గా ఎన్నో రికార్డులు తన ఖాతాలో వేసుకున్న హిట్ మ్యాన్.. తాజాగా టీ20ల్లో అరుదైన ఘనతను అందుకున్నాడు. 

ఇండోర్ వేదికగా ప్రస్తుతం భారత్, ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య రెండో టీ20 మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ రోహిత్ శర్మ కెరీర్ లో 150 టీ20 మ్యాచ్ కావడం విశేషం. అంతర్జాతీయ టీ20 క్రికెట్ లో 150 మ్యాచ్ లాడిన తొలి ప్లేయర్ గా రోహిత్ రికార్డ్ సృష్టించాడు. రోహిత్ తర్వాత స్థానంలో ఐర్లాండ్ ఓపెనర్ పాల్ స్టిర్లింగ్(134) ఉన్నాడు. జార్జ్ డాక్రెల్ (128), షోయబ్ మాలిక్ (124), మార్టిన్ గప్తిల్ (122) వరుసగా మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచారు.   

రోహిత్ శర్మ ఇప్పటివరకు 149 మ్యాచులాడగా.. 31.07 సగటుతో 3,853 పరుగులు చేసి టీ20 క్రికెట్ లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రెండో స్థానంలో నిలిచాడు. విరాట్ కోహ్లి (4,008) అగ్ర స్థానంలో కొనసాగుతున్నాడు. 4 సెంచరీలు చేసిన రోహిత్.. అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా గ్లెన్ మాక్స్‌వెల్‌తో కలిసి టాప్ లో ఉన్నాడు.