ధోని, కోహ్లీకి సాధ్యం కాని రికార్డు రోహిత్ సొంతం

ధోని, కోహ్లీకి సాధ్యం కాని రికార్డు రోహిత్ సొంతం

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు. సౌతాఫ్రికాతో రెండో టీ20లో గెలవడం ద్వారా అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు.  మాజీ కెప్టెన్లు  ధోనీ, కోహ్లీ‌లకు సాధ్యం కానీ రికార్డును రోహిత్ సాధించాడు.  సొంత గడ్డపై దక్షిణాఫ్రికాపై టీ20 సిరీస్ గెలిచిన కెప్టెన్గా రికార్డు క్రియేట్ చేశాడు. 

ధోనీ కెప్టెన్సీలో పరాజయం...
2015లో సౌతాఫ్రికాతో తొలిసారిగా భారత్లో టీ20 సిరీస్ ఆడింది. ధోనీ కెప్టెన్సీలో టీమిండియా మొదటి రెండు టీ20ల్లో ఓడింది.మూడో టీ20 వర్షం కారణంగా రద్దయ్యింది. దీంతో 2-0తో  సిరీస్ కోల్పోయింది. ఇక 2019లోనూ కోహ్లీ కెప్టెన్సీలో టీమిండియా సౌతాఫ్రికాతో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడింది. ఇందులో తొలి మ్యాచ్ రద్దు కాగా.. రెండో టీ20లో భారత్ గెలిచింది. మూడో టీ20లో దక్షిణాఫ్రికా విజయం సాధించింది. దీంతో 1-1తో సిరీస్ సమం అయింది.

పంత్ గెలిపించలేకపోయాడు..
2022 జూన్‌లో సౌతాఫ్రికా మరోసారి భారత గడ్డ మీద పర్యటించింది. మొత్తం  ఐదు టీ20ల సిరీస్ ఆడింది. రిషభ్ పంత్ కెప్టెన్సీలో బరిలోకి దిగిన టీమిండియా 2-2తో సిరీస్‌ను సమం చేసింది.  చివరి మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యింది. తాజాగా సౌతాఫ్రికాపై  టీమిండియా టీ20 సిరీస్ గెలవడంతో.. సౌతాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా దేశాలపై అంతర్జాతీయ టీ20 సిరీస్ గెలిచిన కెప్టెన్‌గా రోహిత్ రికార్డ్ సృష్టించాడు. 

రికార్డుల రోహిత్..
సౌతాఫ్రికాతో జరిగిన రెండో టీ20 రోహిత్ శర్మకు 400వ టీ20 మ్యాచ్. ఈ మ్యాచ్లో 43 పరుగులు చేసిన రోహిత్ శర్మ...ఓ కాలెండర్ ఇయర్లో టీ20ల్లో 500 రన్స్ చేసిన తొలి భారత కెప్టెన్‌గా నిలిచాడు. అంతేకాదు..తొలి టీ20లో గెలవడం ద్వారా...ఒక క్యాలండర్ ఇయర్‌లో అత్యధిక విజయాలు అందుకున్న భారత్ సారథిగా కూడా రోహిత్ శర్మ ఇప్పటికే  రికార్డు క్రియేట్ చేశాడు. గతంలో ఈ రికార్డు ధోని పేరిట ఉండేది. 2016లో ధోని కెప్టెన్సీలో టీమిండియా టీ20ల్లో 15 విజయాలు సాధించింది. ప్రస్తుతం రోహిత్ సారథ్యంలో టీమిండియా 2022లో 16 మ్యాచుల్లో గెలిచింది. రెండో టీ20లో గెలవడం ద్వారా ఈ విజయాల సంఖ్య 17కు చేరింది.