IND vs ENG 5th Test: రోహిత్ అరుదైన ఘనత..సెంచరీల్లో సచిన్ రికార్డ్ సమం

IND vs ENG 5th Test: రోహిత్ అరుదైన ఘనత..సెంచరీల్లో సచిన్ రికార్డ్ సమం

యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు సెంచరీలు కొట్టడం పెద్ద విశేషం కాదు. కానీ 30 సంవత్సరాలు దాటినా సెంచరీల వర్షం కురిపించాలంటే అది టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు మాత్రమే సాధ్యమవుతుంది. ప్రస్తుతం 35 సంవత్సరాల హిట్ మ్యాన్ అంతర్జాతీయ క్రికెట్ లో అరుదైన రికార్డ్ తన ఖాతాలో వేసుకున్నాడు. 

ఇంగ్లాండ్ పై జరుగుతున్న ధర్మశాల టెస్టులో సెంచరీ బాదేసిన ఈ ముంబై బ్యాటర్ తన టెస్ట్ కెరీర్ లో 12 వ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. అతని ఇన్నింగ్స్ లో 3 సిక్సులు, 13 ఫోర్లు ఉన్నాయి. దీంతో అంతర్జాతీయ క్రికెట్ లో రోహిత్ సెంచరీల సంఖ్య 48కి చేరింది. టెస్టుల్లో 12, వన్డేల్లో 31 సెంచరీలు చేసిన హిట్ మ్యాన్..టీ20ల్లో ఐదు సెంచరీలు చేశాడు. ఈ సెంచరీతో 30 సంవత్సరాల తర్వాత అత్యధిక సెంచరీల చేసిన భారత ఆటగాడిగా రోహిత్ శర్మ క్రికెట్ గాడ్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ రికార్డ్ ను సమం చేశాడు. 

30 ఏళ్ళ తర్వాత సచిన్, రోహిత్ ఇద్దరూ కూడా 35 సెంచరీలు చేశారు. రోహిత్ ప్రస్తుతం క్రికెట్ లో కొనసాగుతున్నాడు కాబట్టి  భవిష్యత్తులో సచిన్ రికార్డ్ బ్రేక్ చేయడం పెద్ద కష్టం కాదు. మరో సెంచరీ కొట్టినా టెండూల్కర్ రికార్డ్ ను భారత కెప్టెన్ దాటేస్తాడు. ఇక ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్నవారిలో కోహ్లీ(80), వార్నర్ (49) తర్వాత అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా హిట్ మ్యాన్ మూడో స్థానంలో నిలిచాడు. 

ధర్మశాలలో జరుగుతున్న మ్యాచ్ విషయానికి వస్తే ప్రస్తుతం భారత్ 3 వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసి 82 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించింది. కెప్టెన్ రోహిత్ శర్మ (103), గిల్ (110) సెంచరీలతో చెలరేగారు. యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ 57 పరుగులు చేసి రాణించాడు. ప్రస్తుతం క్రీజ్ లో తొలి టెస్ట్ ఆడుతున్న పడికల్ (18), సర్ఫరాజ్ ఖాన్ (7) ఉన్నారు.