భువీ, హర్షల్‌‌‌‌పై నమ్మకముంది వరల్డ్‌‌ కప్‌‌లోపు పుంజుకుంటారు

భువీ, హర్షల్‌‌‌‌పై నమ్మకముంది వరల్డ్‌‌ కప్‌‌లోపు పుంజుకుంటారు

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌‌లో నిరాశ పరిచిన పేసర్లు భువనేశ్వర్‌‌ కుమార్‌‌, హర్షల్‌‌ పటేల్‌‌కు కెప్టెన్‌‌ రోహిత్‌‌ శర్మ బాసటగా నిలిచారు. టీ20 వరల్డ్‌‌కప్‌‌లోగా ఈ ఇద్దరూ ఫామ్‌‌లోకి వస్తారని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఈ ఇద్దరూ గాయాల నుంచి కోలుకొని తిరిగొచ్చిన నేపథ్యంలో పుంజుకునేందుకు సమయం ఇవ్వాలని అభిప్రాయపడ్డాడు. ‘భువనేశ్వర్‌‌ పుంజుకునే వరకు సమయం ఇవ్వాలి. ఎందుకంటే తను జట్టుకు క్వాలిటీ తీసుకొస్తాడు. గత కొన్నేళ్లలో తను ఫెయిలైన రోజులకంటే సత్తా చాటిన సందర్భాలే ఎక్కువ ఉన్నాయని మాకు తెలుసు. మేం కొన్ని ప్లాన్స్‌‌పై వర్క్‌‌ చేస్తున్నాం. డెత్‌‌ ఓవర్లలో బౌలింగ్‌‌ చేసేందుకు మరికొన్ని ఆప్షన్స్‌‌ తీసుకురాగలం అనుకుంటున్నాం.  భువీ మునుపటిలా సత్తా చాటగలడు. ఎక్కువ పరుగులు ఇచ్చినప్పటికీ అతనిలో కాన్ఫిడెన్స్‌‌ తగ్గిందని అనుకోవడం లేదు. ఈ సమయంలో మేం అతనిపై విశ్వాసం చూపాలి. అతని నైపుణ్యానికి మద్దతు ఇవ్వాలి’అని మూడో టీ20 ముగిసిన తర్వాత మీడియాతో రోహిత్‌‌ చెప్పాడు. ఇక,  గాయం నుంచి కోలుకొని రీఎంట్రీ ఇచ్చిన హర్షల్​ సత్తాను ఈ ఒక్క సిరీస్‌‌తో అంచనా వేయకూడదని అభిప్రాయపడ్డాడు. ‘నిస్సందేహంగా హర్షల్ మాకు ముఖ్యమైన ఆటగాడు. గాయం తర్వాత తిరిగి రావడం అంత ఈజీ కాదు. దాదాపు రెండు నెలల పాటు తను  క్రికెట్‌‌కు దూరమయ్యాడు. రీఎంట్రీ ఎవ్వరికీ సులభం కాదు కాబట్టి ఈ మూడు మ్యాచ్‌‌ల్లో ఆట చూసి మేం అతనిపై ఓ నిర్ణయానికి రాలేం. అతని క్వాలిటీ ఏంటో మాకు తెలుసు. గతంలో ఇండియాతో పాటు ఐపీఎల్‌‌లో ఎన్నో కఠినమైన ఓవర్లు వేశాడు. కాబట్టి అతనిపై నమ్మకం ఉంచడం చాలా ముఖ్యం. హర్షల్‌‌ కూడా తన తప్పులను సరిదిద్దడానికి ప్రయత్నిస్తున్నాడు. తన బెస్ట్‌‌ ఇవ్వడానికి ఎంతో దూరంలో లేడని నేను అనుకుంటున్నా’ అని రోహిత్‌‌ పేర్కొన్నాడు. ఇక, టీ20 వరల్డ్‌‌కప్‌‌ ముగింట  సీనియర్‌‌ కీపర్‌‌ దినేశ్‌‌ కార్తీక్‌‌కు మరిన్ని మ్యాచ్‌‌ల్లో ఆడే అవకాశం ఇస్తామని  చెప్పాడు.