రాజీవ్‌గాంధీ  ఖేల్‌రత్న అవార్డుకు రోహిత్‌ నామినేట్‌

రాజీవ్‌గాంధీ  ఖేల్‌రత్న అవార్డుకు రోహిత్‌ నామినేట్‌

అత్యున్నత క్రీడా అవార్డు…రాజీవ్‌గాంధీ ఖేల్‌ రత్న అవార్డుకు నలుగురు ప్లేయర్లను సెలక్షన్‌ కమిటీ నామినేట్‌ చేసింది. క్రికెటర్‌, టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మతో పాటు రెజ్లర్‌ వినేశ్ పోగట్‌, టీటీ ప్లేయర్‌ మానికా బత్రా, పారాఒలింపిక్ గోల్డ్ మెడల్ విజేత మరియప్పన్‌ తంగవేలు ఉన్నారు. క్రీడా మంత్రిత్వశాఖకు చెందిన సెలక్షన్‌ కమిటీ ఈ నలుగురి పేర్లను సూచించింది. అత్యున్నత క్రీడా అవార్డుకు నలుగురు క్రీడాకారులు నామినేట్‌ కావడం ఇది రెండవసారి.

2016లో కూడా నలుగురు క్రీడాకారుల్ని ఈ అవార్డు కోసం నామినేట్‌ చేశారు. సెలక్షన్‌ కమిటీలో వీరేంద్ర సెహ్వాగ్‌, మాజీ హాకీ కెప్టెన్‌ సర్దార్‌ సింగ్‌లు ఉన్నారు. స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా ప్రధాన కార్యాలయంలో  మంగళవారం(ఆగస్టు-18) కమిటీ భేటీ అయ్యింది.

గతేడాది రోహిత్‌ శర్మ బ్యాటింగ్‌లో మెరుపులు మెరిపించాడు. 2019 సీజన్‌లో రోహిత్‌ వన్డేల్లో ఏడు సెంచరీలు చేశాడు. మొత్తం 1490 రన్స్‌ చేశాడు. రెజ్లర్‌ వినేశ్‌ పోగట్‌.. 2018 కామన్‌వెల్త్‌, ఏషియా గేమ్స్‌లో గోల్డ్‌ మెడల్‌ సాధించారు. ఒకవేళ రోహిత్‌కు ఖేల్‌ రత్న అవార్డు దక్కితే.. ఆ అవార్డును అందుకున్న నాలుగవ క్రికెటర్‌గా అతను నిలుస్తాడు. ఇప్పటివరకు సచిన్‌, ధోనీ, కోహ్లీలు ఈ అవార్డును గెలచుకున్నారు. అయితే 2016లో షట్లర్‌ పీవీ సింధు, జిమ్నాస్ట్‌ దీపా కర్మాకర్‌, షూటర్  జీతూ రాయ్, రెజ్లర్‌ సాక్షీ మాలిక్ లకు సంయుక్తంగా ఖేల్‌ రత్న అవార్డును బహూకరించారు.