మర్చిపోయి ముందుకు వెళ్లడం కష్టమే..వరల్డ్ కప్ ఫైనల్ ఓటమిపై రోహిత్ ఎమోషనల్

మర్చిపోయి ముందుకు వెళ్లడం కష్టమే..వరల్డ్ కప్ ఫైనల్ ఓటమిపై రోహిత్ ఎమోషనల్

వరల్డ్ కప్ 2023లో టోర్నీ అసాంతం వరుస విజ‌యాల‌తో అద్భుతంగా రాణించిన భారత జట్టు ఆఖ‌రి మెట్టుపై బోల్తా పడింది. నవంబర్ 19న (ఆదివారం) అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఫైన‌ల్ పోరులో టీమిండియా..ఆసీస్ చేతిలో 6 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఈ పరాజయంతో భారత క్రికెటర్లు, అభిమానులు దుఃఖసాగరంలో మునిగిపోయారు. మ్యాచ్ ముగిసి 20 రోజులు దాటినా ఈ ఓటమిని యావత్ దేశం జీర్ణించుకోలేకపోతోంది. సొంతగడ్డపై ఓడిపోవడంతో ఈ పరాజయం నుంచి బయటకు రాలేకపోతున్నారు. ఈ ఓటమిపై  టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తొలిసారి స్పందిస్తూ ఎమోషనల్ కామెంట్స్ చేసాడు. 

రోహిత్ మాట్లాడుతూ.. "ఈ ఓటమి నుండి ఎలా బయటకు రావాలో అర్ధం కావట్లేదు. నా కుటుంబం, స్నేహితులు నాకు ఓదార్పు చెప్పి నాలో బాధను తొలగించే ప్రయత్నం చేశారు. ఓటమిని జీర్ణించుకోవడం కష్టంగానే ఉంటుంది. కానీ జీవితం ముందుకు కొనసాగుతుంది కదా. 50 ఓవర్ల ప్రపంచ కప్ చూస్తూ పెరిగాను. దేశానికి వరల్డ్ కప్ గెలిపించడం నా చివరి కళ. ప్రపంచ కప్ సాధించడంలో విఫలమైనందుకు అభిమానులు నిరాశ చెందారు". అని హిట్ మ్యాన్ వీడియోలో తెలిపాడు. 

వరల్డ్ కప్ టోర్నీలో మా వైపు నుండి మేము చేయగలిగినదంతా చేశామని.. మేము వరుసగా 10 మ్యాచ్ లు గెలిచినా తప్పులు చేశామని రోహిత్ చెప్పుకొచ్చాడు. ఎవరు కూడా ప్రతి మ్యాచ్ లో పర్ఫెక్ట్ గేమ్ ఆడలేరని.. ఫైనల్లో మా ఆట తీరుపై బాధపడుతున్నామని తెలిపాడు. వరల్డ్ కప్ తర్వాత ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ కు దూరంగా ఉన్న రోహిత్.. ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో జరుగుతున్న పరిమిత ఓవర్ల క్రికెట్ నుంచి రెస్ట్ తీసున్నాడు. డిసెంబర్ 26 నుంచి దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్ కు రోహిత్ కెప్టెన్ గా అందుబాటులో ఉంటాడు.