Rohit Sharma: విజయ్ హజారే ట్రోఫీలో రోహిత్ శర్మ.. డొమెస్టిక్ క్రికెట్ ఆడేందుకు నెం.1 వన్ బ్యాటర్ గ్రీన్ సిగ్నల్

Rohit Sharma: విజయ్ హజారే ట్రోఫీలో రోహిత్ శర్మ.. డొమెస్టిక్ క్రికెట్ ఆడేందుకు నెం.1 వన్ బ్యాటర్ గ్రీన్ సిగ్నల్

టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ డొమెస్టిక్ క్రికెట్ ఆడేందుకు సిద్ధమయ్యాడు. వన్డే ఫార్మాట్ లో జరగబోయే దేశవాళీ ప్రతిష్టాత్మక టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో హిట్ మ్యాన్ కనిపించనున్నాడు. 2027 వన్డే వరల్డ్ కప్ వరకు భారత జట్టులో కొనసాగాలంటే విజయ్ హజారే ట్రోఫీ ఖచ్చితంగా ఆడాలని బీసీసీఐ సూచించిన కొన్ని గంటలకే రోహిత్ శర్మ విజయ్ హజారే ట్రోఫీ ఆడేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. 2025 లో జరగబోయే విజయ్ హజారే ట్రోఫీలో ఆడటానికి తాను అందుబాటులో ఉంటాననే తన నిర్ణయాన్ని రోహిత్ శర్మ   బుధవారం (నవంబర్ 12) ముంబై క్రికెట్ అసోసియేషన్ (MCA)కి తెలియజేశాడు.

రిపోర్ట్స్ ప్రకారం.. విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా డిసెంబర్ 24న ముంబై ఆడబోయే తొలి మ్యాచ్ లో రోహిత్ ఆడనున్నట్టు కన్ఫర్మ్ చేసినట్టు సమాచారం. ఈ టోర్నీకి ముందు రోహిత్ సౌతాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్ లో కనిపించనున్నాడు. విజయ్ హజారే ట్రోఫీ తర్వాత జనవరిలో న్యూజిలాండ్ పై జరగనున్న మూడు మ్యాచ్ ల్లో ఆడతాడు. 2027 వన్డే వరల్డ్ కప్ వరకు రోహిత్ కొనసాగాలంటే ప్రాక్టీస్ ఫిట్ నెస్ తో పాటు ఫామ్ కోల్పోకుండా ఉండాలి. ప్రస్తుతం వన్డే ఫార్మాట్ మాత్రమే ఆడుతున్న రోహిత్ మరో రెండేళ్లు ఫామ్, ఫిట్ నెస్ కాపాడుకోవాలంటే డొమెస్టిక్ క్రికెట్ ఆడక తప్పదు.     

ఆస్ట్రేలియాతో ఇటీవలే ముగిసిన మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ లో మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ అదరగొట్టాడు. తొలి వన్డేలో విఫలమైనా రెండో వన్డేలో హాఫ్ సెంచరీ ( 97 బంతుల్లో 73) చేసి రాణించాడు. సిడ్నీలో జరిగిన మూడో వన్డేలో చెలరేగుతూ సెంచరీ (125 బంతుల్లో 121) పరుగులు మార్క్ అందుకున్నాడు. ఓవరాల్ గా ఈ సిరీస్ లో అత్యధిక పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు గెలుచుకున్నాడు. ఈ సిరీస్ లో అద్భుతంగా రాణించిన రోహిత్ శర్మ ప్రస్తుతం వన్డేల్లో నెంబర్ వన్ ర్యాంక్ లో కొనసాగుతున్నాడు.  

బీసీసీఐ అల్టిమేటం జారీ:
 
టీమిండియా స్టార్ క్రికెటర్స్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మకు బీసీసీఐ అల్టిమేటం జారీ చేసినట్లు తెలుస్తోంది. ఇకపై వన్డేల్లో కొనసాగాలంటే దేశవాళీ క్రికెట్ ఆడాల్సిందేనని రోహిత్, కోహ్లీ ఇద్దరిని బీసీసీఐ ఆదేశించినట్లు సమాచారం. ‘‘ఇండియా తరపున వన్డేలు ఆడాలనుకుంటే దేశీయ క్రికెట్ ఆడవలసి ఉంటుందని కోహ్లీ, రోహిత్‎కు బీసీసీఐ తెలియజేసింది. వారిద్దరూ టెస్ట్, టీ20 ఫార్మాట్ల నుంచి రిటైర్ కావడంతో ఫామ్, ఫిట్‏నెస్ -కోల్పోకుండా ఉండటానికి దేశీయ క్రికెట్ ఆడాలి’’ అని బోర్డు వర్గాలు వెల్లడించాయి.