ఆదర్శంగా నిలుస్తోన్న పొదుపు సంఘాల మహిళలు

ఆదర్శంగా నిలుస్తోన్న పొదుపు సంఘాల మహిళలు
  • టార్గెట్​ను మించి రుణాల మంజూరు
  • రాష్ట్రంలో టాప్​10లో మూడు జిల్లాలు మనవే
  • వ్యాపారాలతో ఆర్థికాభివృద్ధి సాధిస్తున్న మహిళలు


మహబూబాబాద్, వెలుగు: బ్యాంకుల నుంచి లోన్లు తీసుకుని.. ఆ డబ్బుతో వ్యాపారాలు చేస్తూ.. సకాలంలో రుణాలను చెల్లిస్తూ ఉమ్మడి జిల్లాలోని పొదుపు సంఘాల మహిళలు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఉమ్మడి వరంగల్​ జిల్లాలో 2021–22 ఆర్థిక సంవత్సరంలో బ్యాంకులు మహిళా సంఘాలకు 1,609.09 కోట్ల రుణాలను ఇవ్వాలని టార్గెట్​గా పెట్టుకోగా 1,727.83 కోట్లు ఇచ్చాయి. రాష్ట్రంలోని చాలా జిల్లాలు ప్రతి సంవత్సరం వంద శాతం టార్గెట్ రీచ్ కావాలని ప్రయత్నిస్తున్నా సక్సెస్​ కాలేకపోతున్నాయి. కానీ ఉమ్మడి వరంగల్​లోని అన్ని జిల్లాల్లో వంద శాతానికి మించి లోన్లు పంపిణీ చేశారు. అంతేకాకుండా రుణాల పంపిణీలో రాష్ట్రంలోని టాప్​టెన్ ​జిల్లాల్లో మూడు ఉమ్మడి వరంగల్​లోనివే కావడం గమనార్హం. డ్వాక్రా సంఘాలకు బ్యాంక్​ రుణాల పంపిణీలో 2021–22 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర స్థాయిలో సంగారెడ్డి జిల్లా మొదటి స్థానంలో నిలువగా, మూడో స్థానంలో వరంగల్, ఆరో స్థానంలో జనగామ, 10వ స్థానంలో మహబూబాబాద్​, 17వ స్థానంలో ములుగు, 26వ స్థానంలో జయశంకర్​ భూపాలపల్లి, 27వ స్థానంలో హనుమకొండ జిల్లాలు నిలిచాయి. రాష్ట్ర పంచాయతీరాజ్​, రూరల్​ డెవలప్​ మెంట్​ మినిస్టర్ ఎర్రబెల్లి దయాకర్​రావు ఉమ్మడి జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తుండడంతో ఆఫీసర్లు బ్యాంకు రుణాల పంపిణీ టార్గెట్​రీచ్​అయ్యేలా కృషి చేశారు.

ఆర్థికంగా  ఎదుగుతున్న మహిళలు

పొదుపు సంఘాల మహిళలు బ్యాంకుల ద్వారా పొందిన రుణాలతో వివిధ వ్యాపారాలు చేస్తూ ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తున్నారు. వ్యవసాయ కుటుంబాలకు చెందిన మహిళలు లోన్​డబ్బులను కూరగాయలు, ఇతర పంటల సాగుకు వినియోగిస్తుండగా ఇతర మహిళలు ఆ డబ్బులతో కిరాణాషాప్ పెట్టుకుంటున్నారు. పలువురు గేదెల పెంపకం చేపట్టి పాల బిజినెస్​చేస్తున్నారు. ఇక కుట్టుమెషిన్లు, రెడీమేడ్​దుస్తుల విక్రయాలు, ఇతర కుటీర పరిశ్రమలు సైతం నిర్వహిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రతి నెలా క్రమం తప్పకుండా లోన్​తిరిగి చెల్లిస్తుండడంతో బ్యాంకర్లు సైతం క్రమంగా వారికి ఇచ్చే లోన్​మొత్తాన్ని పెంచుతూ పోతున్నారు. 


లోన్​ రికవరీ బాగుంది

2021–-22 ఆర్థిక సంవత్సరంలో మహబూబాబాద్​ జిల్లాలో 12,160 స్వయం సహాయక సంఘాలకు రూ. 343.24 కోట్లు బ్యాంక్ లింకేజ్ లక్ష్యం కాగా, 8,273 సంఘాలకు రూ.364.79 కోట్లు మంజూరు చేశాం. మహిళలు వారు పొందిన రుణాలను క్రమం తప్పకుండా చెల్లిస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరం  రూ.412 కోట్లు లక్ష్యంగా పెట్టుకున్నాం.  

-  సన్యాసయ్య,  డీఆర్డీఏ పీడీ, మహబూబాబాద్​