రొమాన్స్ స్కామ్..రూ.1,025 కోట్లు ఖల్లాస్

రొమాన్స్ స్కామ్..రూ.1,025 కోట్లు ఖల్లాస్

నచ్చిన వాళ్లను సెలెక్ట్​ చేసుకోవడం.. వాళ్లపై తమ ఇంట్రెస్ట్​ను చూపిస్తూ రిక్వెస్ట్​లు పంపడం.. వాళ్లకూ నచ్చితే రొమాన్స్​ చేసేయడం.. ఇదీ డేటింగ్​ యాప్​లలో ఇప్పుడు జరుగుతున్నది. కానీ, ఆ రొమాన్స్​ పేరిట ఓ పెద్ద స్కామే జరుగుతోందన్న సంగతి తెలుసా? డేటింగ్​ యాప్​ల మాటున సైబర్​ కేటుగాళ్లు ఉచ్చు బిగిస్తున్నారన్న విషయం తెలుసా? చాలా మందికి తెలిసుండదు. అలాంటి ఓ పెద్ద ముఠా గుట్టును రట్టు చేశారు అమెరికా ఫెడరల్​ అధికారులు. ఒక్కరా.. ఇద్దరా.. ప్రపంచ వ్యాప్తంగా రొమాన్స్​ పేరిట బుట్టలో వేసుకుని మోసం చేసిన 80 మందిని లాస్​ఏంజిలిస్​లో అరెస్ట్​ చేశారు అమెరికా ఫెడరల్​ అధికారులు. వాళ్ల చేతిలో 2018లో ఒక్క అమెరికాలోనే 21 వేల మంది మోసపోయారు. ఆ మోసం విలువ అక్షరాలా 14.3 కోట్ల డాలర్లు (సుమారు 1025 కోట్ల రూపాయలు). ఫెడరల్​ ట్రేడ్​ కమిషన్​ చెబుతున్న మాటిది. 2015 నుంచి పోలిస్తే ఈ మోసాలు నాలుగు రెట్లయ్యాయి. ‘‘డేటింగ్​ యాప్​ల పేరిట మోసగాళ్లు పెద్ద వలనే పన్నుతున్నారు. అంతేకాదు, డేటింగ్​ ఉండని మామూలు సోషల్​ మీడియా ద్వారా కూడా ఉచ్చు బిగిస్తున్నారు. ఒక్క ఫేస్​బుక్​ మెసేజ్​తో స్కామ్​ మొదలైపోతోంది. ఇలా ఒకరిద్దరు కాదు.. వేలాది మంది బాధితులుగా మిగిలిపోతున్నారు. జేబులు గుల్ల చేసుకుంటున్నారు” అని ఫెడరల్​ ట్రేడ్​ కమిషన్​ హెచ్చరించింది. ఒకవేళ అలాంటి కేటుగాళ్లు డేటింగ్​ యాప్​లు, లేదా సోషల్​ మీడియాల్లో మెసేజ్​లు పంపి, డబ్బులు డిమాండ్​ చేస్తే వాళ్లని మోసగాళ్లుగా గుర్తించాలని చెప్పింది.