సువిధ యాప్‌‌‌‌తో అభ్యర్థులకు అనుమతులు

సువిధ యాప్‌‌‌‌తో అభ్యర్థులకు అనుమతులు

హైదరాబాద్, వెలుగు: సువిధ యాప్​తో సింగిల్ విండో పద్ధతిలో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ  చేసే అభ్యర్థులకు ఈజీగా అనుమతులు ఇవ్వనున్నట్లు హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, బల్దియా కమిషనర్ రోనాల్డ్ రాస్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు.   మీటింగ్, ర్యాలీలు, వాహనాలు, తాత్కాలిక ఎలక్షన్ ఆఫీస్, లౌడ్ స్పీకర్, హెలికాప్టర్, హెలిప్యాడ్ అనుమతి కోసం సులభతరంగా ఒకే చోట అనుమతులు కల్పించేందుకు ఎన్నికల కమిషన్ వెసులుబాటు కల్పించిందన్నారు.  

ఇంతకు ముందు ఒక్కొక్క అనుమతికి ఒక్కో ఆఫీసుకు వెళ్లి అనుమతులు పొందేవారని, ఇప్పుడు ఒకే చోట పోటీచేసే అభ్యర్థి స్వయంగా సువిధ యాప్ ద్వారా అన్ని రకాల అనుమతులు పొందవచ్చన్నారు.నామినేషన్లను వేసే ప్రదేశంలో ఆర్వో ఆఫీసు వద్దనే అనుమతి తీసుకోవచ్చన్నారు. ఈవీడీఎం డైరెక్టర్ ప్రకాశ్‌‌‌‌ రెడ్డి ఎన్నికల ప్రవర్తన నియమావళి నోడల్ అధికారిగా వ్యవహరిస్తున్నట్లు రోనాల్డ్ రాస్ తెలిపారు.  

బల్దియా హెడ్డాఫీసులోని  విజిలెన్స్ ఆఫీస్‌‌‌‌లో 24  గంటల పాటు పని చేసే విధంగా షిఫ్ట్ సిస్టమ్​లో సిబ్బందిని, అధికారులను ఏర్పాటు చేశామన్నారు. నామినేషన్లు మొదలైన వెంటనే ఆర్వో ఆఫీసు వద్ద  నియోజకవర్గం నోడల్ అధికారిగా వ్యవహరిస్తున్న ఏఎస్పీ స్థాయి అధికారిని హైదరాబాద్ సీపీ నియమించనున్నారు. వీరి ఆధ్వర్యంలో నియోజకవర్గంలో ఎలాంటి శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా అనుమతులు పారదర్శకంగా  జారీ చేయనున్నట్లు కమిషనర్ తెలిపారు.