సౌదీ క్లబ్ అల్ నాసర్ కి ఆడేందుకు రొనాల్డో ఒప్పందం

సౌదీ క్లబ్ అల్ నాసర్ కి ఆడేందుకు రొనాల్డో ఒప్పందం

న్యూఢిల్లీ: పోర్చుగల్​ సాకర్​ లెజెండ్​ క్రిస్టియానో రొనాల్డో ఫుట్‌‌బాల్‌‌ హిస్టరీలోనే అతి పెద్ద డీల్‌‌ కుదుర్చుకున్నాడు. మాంచెస్టర్‌‌ యునైటెడ్‌‌ క్లబ్‌‌కు గుడ్‌‌బై చెస్సిన రొనాల్డో ఇకపై  సౌదీ ఆరేబియాకు చెందిన ‘అల్​ నాసర్’ ఫుట్​బాల్​​క్లబ్‌‌కు ఆడేందుకు సంతకం చేశాడు. ఇందకోసం అతను ఏడాదికి 200 మిలియన్​ యూరోలు (రూ. 1775 కోట్లు) తీసుకుంటాడని తెలుస్తోంది. ఇందులో జీతం 75 మిలియన్​ డాలర్లు (రూ. 620 కోట్లు) కాగా, మిగతావి ఎండార్స్​మెంట్ల రూపంలో వస్తాయని సమాచారం.

అయితే రొనాల్డో శాలరీని క్లబ్‌‌ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఓవరాల్​గా 2023 నుంచి జూన్​ 2025 వరకు (రెండున్నర ఏళ్లు) ఈ కాంట్రాక్ట్​ అమల్లో ఉంటుంది. ఈ కాలంలో అన్ని రూపాల్లో కలిపి రొనాల్డోకు రూ. 4400 కోట్లు వస్తాయని తెలుస్తోంది. అయితే, 200 మిలియన్‌‌ యూరోల డీల్‌‌ అనేది  మొత్తం రెండున్నర సంవత్సరాలకు అన్న వార్తలు వస్తున్నాయి. అలా అయినా ఫుట్​బాల్​ హిస్టరీలో ఇదే అతిపెద్ద డీల్​ కానుంది. దాంతో పాటు అత్యధిక శాలరీ తీసుకుంటున్న తొలి ప్లేయర్​గానూ రొనాల్డో రికార్డులకెక్కాడు.

గతంలో అర్జెంటీనా స్టార్​ లియోనల్​ మెస్సీకి.. పీఎస్​జీ క్లబ్  ఏడాదికి 35 మిలియన్​ పౌండ్లు (రూ. 350 కోట్లు) చెల్లించేది. ఈ రికార్డును ఇప్పుడు రొనాల్డో అధిగమించబోతున్నాడు. కొత్త టీమ్​కు సంబంధించిన జెర్సీతో ఉన్న రొనాల్డో ఫొటోను నాసర్​ క్లబ్​ ట్వీట్‌‌ చేసింది. ‘వేరే దేశంలో కొత్త లీగ్​లో ఆడేందుకు ఎదురుచూస్తున్నా. కొత్త టీమ్​మేట్స్​తో కలిసేందుకు ఉత్సాహంగా ఉన్నా. క్లబ్​కు మంచి విజయాలను అందించేందుకు కృషి చేస్తా. అల్​ నాసర్ క్లబ్​ దృక్పధం చాలా స్ఫూర్తిదాయకంగా ఉంది’ అని రొనాల్డో వ్యాఖ్యానించాడు. గతంలో అల్​ నాసర్ క్లబ్​..​ తొమ్మిదిసార్లు ప్రొ సౌదీ ఆరేబియన్​ లీగ్​ టైటిల్స్​ నెగ్గింది. చివరిసారిగా 2019లో విన్నర్​గా నిలిచింది.