మెదక్: ఒకే పందిట్లో అక్కా చెళ్లెల్లిద్దరిని పెళ్లి చేసుకున్నాడు ఓ యువకుడు. కొద్ది రోజుల క్రితం కర్నాటకలోని కోలార్ జిల్లాలో జరిగినట్లు విచిత్రమైన అలాంటి పెళ్లే మెదక్ జిల్లా కొల్చారం మండలం అంసాన్పల్లిలో ఆదివారం జరిగింది. తన చెల్లికి కూడా తాళి కట్టాల్సిందేనని వధువు భీష్మించడంతో కోలార్ జిల్లాలో ఉమాపతి అనే యువకుడు వధువు తోపాటు పుట్టు మూగ, చెవిటి అయిన ఆమె 16 ఏళ్ల చెల్లికి కూడా తాళి కట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడం.. పెళ్లికొడుకును అరెస్టు చేసి ఇరువైపులా తల్లిదండ్రులతోపాటు.. వారికి పెళ్లి జరిపించిన పూజారి, పెళ్లి కార్డు ముద్రించిన ప్రింటింగ్ ప్రెస్ యజమానులపై కూడా పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.
ఈ ఘటన ఇంకా మరచిపోకపోముందే.. ఇవాళ మెదక్ జిల్లాలో కొల్చారం మండలం అంసాన్పల్లి గ్రామంలో దాదాపు అలంటి తరహా పెళ్లే జరిగింది. గ్రామానికి చెందిన గోల్పల వెంకటేశంకు స్వాతి, శ్వేత అనే ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. పెద్ద కూతురు స్వాతికి శివ్వంపేట మండలం పాంబండ గ్రామానికి చెందిన బాల్ రాజ్ తో పెళ్లి ఖాయమైంది. కాగా పెళ్లి కొడుకు బాల్ రాజ్ తోపాటు, అతని కుటుంబ సభ్యుల అంగీకారంతో మతిస్థిమితం లేని వెంకటేశం రెండో కూతురు శ్వేతకు కూడా అతనితోనే పెళ్లి చేయాలని నిశ్చయించారు. పెండ్లి పత్రికలో కూడా వధువు ప్లేస్లో ఇద్దరు అమ్మాయిల పేర్లు రాయించారు. ముందుగా నిర్ణయించిన ముహూర్తం ప్రకారం ఆదివారం ఒకే పందిట్లో బాలరాజ్ స్వాతి, శ్వేత ఇద్దరికి తాళి కట్టాడు. పెద్ద కూతురు స్వాతిని పెళ్లి కొడుకు బాల్రాజ్తో పాటు అత్తారింటికి పంపించగా, మతిస్థిమితం లేని రెండో కూతురు శ్వేతను పుట్టింటిలోనే ఉంచుకోవడం గమనార్హం.
