
చదవడం అలవాటుగా చేయడానికి పాఠశాల మూల కేంద్రం కనుక రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తున్నది. రూమ్ టు రీడ్ సంస్థ వారి సౌజన్యంతో రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ ప్రభుత్వ బడుల్లో పుస్తకాల చెంతకు పిల్లలు చేరేటట్లు భాషాభివృద్ధి వాతావరణం కల్పించడానికి కృషి చేస్తున్నది. పిల్లల్లో మౌలిక భాషా సామర్థ్యాలను పెంపొందించడానికి అమలుపరుస్తున్న ఎఫ్ ఎల్ ఎన్ కార్యక్రమంలో భాగంగా పఠన సామర్థ్యాన్ని పెంచడానికి, విద్యార్థులను స్వతంత్ర పాఠకులుగా మార్చడానికి రాష్ట్ర విద్యాశాఖ సత్ఫలితాలు ఇచ్చేవిధంగా ప్రయత్నం ప్రారంభించింది.
ప్రస్తుత సమాజంలో విస్తరిస్తున్న ప్రపంచీకరణ నేపథ్యంలో అరచేతిలో ఇమిడిపోతున్న మొబైల్ ఫోన్ బాల్యాన్ని పుస్తకానికి దూరం చేస్తున్నది. పిల్లల జీవితంలో మొబైల్ ఫోన్ ఒక భాగం అయిపోయింది. ఇలాంటి విపత్కర పరిస్థితి నుంచి విద్యార్థులను బయటకులాగి స్నేహపూర్వక గ్రంథాలయాన్ని ప్రభుత్వ బడుల్లో నెలకొల్పాలి. పఠన కార్యక్రమంలో పిల్లలు మరింత ఉత్సాహంగా పాల్గొనేలా, స్వేచ్ఛగా మాట్లాడేలా, ఇష్టంగా చదివేలా పుస్తకాల పట్ల అనురక్తి కలిగించాలి. విద్యార్థులు స్వతంత్ర పాఠకులుగా మారేలా ప్రభుత్వ బడుల్లో గ్రంథాలయాలను ఏర్పాటు చేయడం హర్షణీయం. ఇప్పటికే ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చిన విద్యాశాఖ అందుబాటులో ఉన్న నాణ్యమైన బాల సాహిత్యాన్ని పిల్లలకు చేరువ చేయడానికి ప్రణాళిక రూపొందించి క్షేత్రస్థాయిలో అమలుపరుస్తున్నది. ప్రతి పాఠశాలలో ప్రతి తరగతికి గ్రంథాలయం పిరియడ్ ను అందుబాటులోకి తెచ్చి విద్యార్థులు పుస్తకాలు చదివేలా అనువైన వాతావరణాన్ని కల్పిస్తున్నారు. అలాగే పిల్లలు ఖాళీ సమయాల్లో పఠనం చేసేలా పుస్తకాలను ఇంటికి తీసుకెళ్లి చదివే విధంగా ఉపాధ్యాయులు ప్రోత్సహిస్తున్నారు.
బాలసాహిత్యం
పిల్లలకు మౌఖిక పఠనం, భాగస్వామ్య పఠనం స్వతంత్ర పఠనం చేయిస్తూ చదవడం ఒక అలవాటుగా మార్చడానికి ఉపాధ్యాయులు కృషి చేస్తున్నారు. విభిన్నంగా గ్రంథాలయ నిర్వహణ చేయడం వల్ల విద్యార్థులలో నైతిక విలువలు పెరిగి సమాజంలో మంచి పౌరులుగా ఎదిగే అవకాశం ఉంది. అలాగే విద్యార్థులు ఉపాధ్యాయులతో కూడిన గ్రంథాలయ నిర్వహణ కమిటీని ఏర్పాటు చేయడం, పఠన విధి విధానాలు రూపొందించడం, అందుబాటులో నాణ్యమైన బాలసాహిత్యాన్ని ఉంచడం వల్ల ప్రభుత్వ పాఠశాలల్లో పఠన సంస్కృతి ప్రతిబింబించేలా ప్రోత్సాహక వాతావరణం చోటుచేసుకోనుంది. పిల్లలకు బొమ్మలతో , అక్షరాలతో , పదాలతో, చార్టులతో, కవితలతో ఇతర ముద్రిత సామగ్రితో సృజనాత్మకంగా అభ్యసనాన్ని పెంపొందించే ముద్రిత సమృద్ధి వాతావరణం కల్పించేవిధంగా ఉపాధ్యాయులు కృషి చేస్తున్నారు.
రూమ్ టు రీడ్ వారి సహకారం
ప్రభుత్వ పాఠశాలలో అనేక వినూత్న కార్యక్రమాలు అమలుకోసం విద్యార్థులలో అభ్యసన ఫలితాలు సాధన కోసం అనేక స్వచ్ఛంద సంస్థలు తమ కార్యచరణ ప్రణాళికలు అమలుపరుస్తున్నాయి. అందులో భాగంగా ప్రభుత్వ బడుల్లో స్నేహ పూర్వక గ్రంథాలయాల ఏర్పాటు, అలాగే అనేకరకాల బాలసాహిత్యం విద్యార్థుల దరికి చేర్చడానికి రూమ్ టు రీడ్ అనే సంస్థ రాష్ట్ర విద్య పరిశోధన సంస్థకు తోడ్పాటును అందిస్తున్నది. విద్యార్థులు చదివేస్థాయికి అనుగుణంగా పుస్తక స్థాయి, చదువురాని పిల్లవాడి నుంచి ధారాళంగా చదివే పిల్లవాడి స్థాయి వరకు పుస్తకాలను అందజేస్తున్నది. అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా అన్ని ప్రభుత్వ పాఠశాలలకు రాష్ట్ర ప్రభుత్వం గత విద్యా సంవత్సరం నుంచి ఇప్పటివరకు దాదాపుగా 400 పుస్తకాల వరకు అందజేసింది.
- అంకం నరేష్