
మెహిదీపట్నం, వెలుగు: ఆసిఫ్ నగర్ మండలంలోని దైయి బాగ్ అంగన్వాడీ సెంటర్లో కుళ్లిన కోడిగుడ్లు పంపిణీ చేశారని ఫిర్యాదు రావడంతో చెల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ రేణుక క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నాలుగు రోజుల కింద అశ్విని తన ఇద్దరు (టీన్స్) పిల్లల కోసం 24 గుడ్లు తీసుకొని ఇంటికి వెళ్లి చూడగా, కుళ్లిపోయి ఉన్నాయి. దీంతో అంగన్వాడీ టీచర్ కు, ఆ తర్వాత గుడిమల్కాపూర్ లోని చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీస్రేణుకకు ఫిర్యాదు చేశారు.
దీంతో సోమవారం ఆమె క్షేత్రస్థాయి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమెను ‘వెలుగు’ వివరణ కోరగా, కుళ్లిన కోడిగుడ్లు వచ్చిన విషయం నిజమేనని, దర్యాప్తు జరుగుతోందన్నారు. అబ్దుల్లాపూర్ మెట్ మండలంలోని నితీష్ పౌల్ట్రీ ఫామ్ నుంచి గుడ్లు సరఫరా అవుతున్నట్లు చెప్పారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని సీడీపీఓ పేర్కొన్నారు.