కుళ్లిన మాంసం.. బూజు పట్టిన ఫుడ్స్...వరంగల్ సిటీలో కుళ్లిన ఫుడ్ అమ్ముతున్న హోటల్​ నిర్వాహకులు

కుళ్లిన మాంసం.. బూజు పట్టిన ఫుడ్స్...వరంగల్ సిటీలో  కుళ్లిన ఫుడ్ అమ్ముతున్న హోటల్​ నిర్వాహకులు
  • ఫుడ్​ సేఫ్టీ టాస్క్​ ఫోర్స్​ టీమ్ ఆకస్మిక తనిఖీలు చేసి నోటీసులు జారీ 

హనుమకొండ, వెలుగు: వరంగల్​ సిటీలోని హోటళ్లలో కుళ్లిన మాంసం, కెమికల్స్​కలిపిన చికెన్ బయటపడ్డాయి.  రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ టాస్క్​ ఫోర్స్​టీమ్ ఆకస్మిక తనిఖీలు చేపట్టింది. కాలంచెల్లిన ఐస్​ క్రీములు, బూజుపట్టిన కాలీఫ్లవర్, క్యాబేజీతో చేసిన ఫుడ్​ఐటెమ్స్ ను గుర్తించారు. హోటళ్ల నిర్వాహకులకు ఫుడ్​సేఫ్టీ రూల్స్ మేరకు అధికారులు నోటీసులు జారీ చేశారు. కుళ్లిన మాంసం అమ్ముతున్న బడా హోటల్స్​బాగోతం మరోసారి బట్టబయలవడం సిటీలో కలకలం రేపింది. 

తెలంగాణ ఫుడ్​ సేఫ్టీ కమిషనర్ ఆదేశాల మేరకు  టాస్క్ ఫోర్స్ టీమ్ హెడ్, జోనల్ అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ వి.జ్యోతిర్మయి ఆధ్వర్యంలో ఫుడ్ ఇన్ స్పెక్టర్లు రోహిత్ రెడ్డి, స్వాతి, శ్రీషిక, సిబ్బంది సోమవారం హనుమకొండలోని ఫుడ్ ఆన్ ఫైర్, ల్యాండ్ మార్క్​హోటళ్లలో ఆకస్మిక తనిఖీలు చేశారు. రెస్టారెంట్లలో రూ.45 వేల విలువైన 32 కిలోల కుళ్లిన  మటన్​, చికెన్, రొయ్యలు వంటి మాంసం గుర్తించారు. పాల ప్యాకెట్లు, మసాలాలు,  లేబుల్ డిఫెక్ట్స్ ఉన్న కార్న్, కొబ్బరి పొడి, ఫంగస్  కాలీఫ్లవర్,  క్యాబేజీ వంటికి దొరికాయి. దుర్వాసన వచ్చే రీఫ్రిజరేటర్ తో పాటు అపరిశుభ్రంగా ఉన్న  sతతవంట గదులను చూసి ఆఫీసర్లు షాక్​అయ్యారు. 

ప్రజల ప్రాణాలకు హాని కలిగించేలా ఫుడ్స్ అమ్ముతుండడంతో  ఫుడ్​సేఫ్టీ టాస్క్​ ఫోర్స్​ టీమ్​హెడ్ వి.జ్యోతిర్మయి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆహార భద్రత చట్టాన్ని ఉల్లంఘించినందుకు హోటల్​ నిర్వాహకులకు నోటీసులు ఇచ్చారు. కొన్ని శాంపిల్స్​ను హైదరాబాద్​లోని ఫుడ్​సేఫ్టీ ల్యాబ్​ కు పంపారు. రిపోర్ట్ లో  కల్తీ ఆహార పదార్థాలని నిర్ధారణ అయితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని జ్యోతిర్మయి స్పష్టంచేశారు. క్రిమినల్ కేసులు నమోదుతో పాటు సీజ్ కూడా చేస్తామని హెచ్చరించారు.