
హైదరాబాద్, వెలుగు: పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లును పెట్టాలన్న డిమాండ్‌తో ఢిల్లీలో భారత్ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. బుధవారం లే మెరీడియన్ హోటల్లో నిర్వహించిన ఈ చర్చావేదికలో 13 రాజకీయ పార్టీల ఎంపీలు, నేతలు, ప్రజా, మహిళా సంఘాల లీడర్లు పాల్గొన్నారు. ఓటు వేసేందుకు మహిళలకు సమాన హక్కులను కల్పించినప్పుడు.. చట్టసభల్లో మాత్రం మహిళలకు ఎందుకు రిజర్వేషన్లు ఇవ్వరని శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది ప్రశ్నించారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతిస్తున్నామని ఆర్జేడీ ఎంపీ మనోజ్ ఝా అన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు పితృస్వామ్య వ్యవస్థలు అడ్డొస్తున్నాయని సీపీఐ ఎంపీ బినోయ్ బిశ్వం అన్నారు. రిజర్వేషన్లపై మహిళలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని ఆర్ఎల్డీ మహిళా విభాగం నేత ప్రతిభా సింగ్, ఆ పార్టీ నేత భూపేంద్ర చౌదరి అన్నారు. చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం తక్కువగా ఉండడం బాగాలేదని జేఎంఎం ఎంపీ మౌహా మాఝి అన్నారు. కేంద్ర ప్రభుత్వానికి పూర్తి మెజారిటీ ఉందని, కాబట్టి, మహిళా రిజర్వేషన్ బిల్లును తెచ్చేందుకు దానిని ఉపయోగించాలని ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా పేర్కొన్నారు. వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకోవడంలో మహిళల భాగస్వామ్యం తప్పనిసరి అని డీఎంకే ఎంపీ తమిళిసై తంగపాండ్యన్ అన్నారు.
మహిళలకు సమాన స్థానం ఉండాలి: కవిత
రాజ్యాంగంలో మహిళలకు సమాన హక్కులను కల్పించారు కానీ, అవి అమలు కావట్లేదని ఎమ్మెల్సీ కవిత అన్నారు. రౌండ్ టేబుల్ సమావేశానికి ముందు ఆమె మీడియాతో మాట్లాడారు. నేల, నింగిలో మహిళలు సగమని చెప్తున్నా.. సమాన అవకాశాలు మాత్రం రావడం లేదన్నారు.