- వాళ్లిద్దరిని పట్టుకునేందుకు వెంబడించిన
- డీసీపీ చైతన్య, గన్‌మన్ సత్యనారాయణ
- గన్‌మన్‌పై కత్తితో దాడికి రౌడీషీటర్ యత్నం.. డీసీపీ కాల్పులు
- నిందితుడి కడుపు, చేతిలోకి దూసుకెళ్లిన బుల్లెట్లు
- చాదర్‌ఘాట్‌లోని విక్టరీ ప్లే గ్రౌండ్ వద్ద ఘటన
హైదరాబాద్/బషీర్‌బాగ్, వెలుగు: హైదరాబాద్‌లో కాల్పుల కలకలం రేగింది. దొంగతో కలిసి ఓ రౌడీషీటర్ ఫోన్ కొట్టేసి పారిపోతుండగా పట్టుకునేందుకు పోలీసులు వెంబడించారు. అయితే ఆ రౌడీషీటర్ కత్తితో దాడికి యత్నించడంతో ఫైరింగ్ చేశారు.
పాతబస్తీ కామాటిపురాకు చెందిన రౌడీషీటర్ మహ్మద్ ఒమర్ అన్సారీ, మరో దొంగతో కలిసి శనివారం చాదర్‌ఘాట్ ప్రాంతంలో మొబైల్ స్నాచింగ్‌కు పాల్పడ్డాడు. సాయంత్రం 5 గంటల సమయంలో స్థానికులను బెదిరిస్తూ తప్పించుకుని పారిపోయే ప్రయత్నం చేశాడు.
అదే సమయంలో సీపీ ఆఫీసులో మీటింగ్ ముగించుకుని సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ చైతన్య కుమార్ చాదర్‌ఘాట్‌లోని విక్టరీ ప్లే గ్రౌండ్ మీదుగా వస్తున్నారు. దొంగలను గమనించిన డీసీపీ చైతన్య, ఆయన గన్‌మెన్ సత్యనారాయణ మూర్తి.. వాళ్లను వెంబడించారు. ఈ క్రమంలో అన్సారీ చాదర్‌ఘాట్ బ్రిడ్జి మీదుగా ఇసామియా బజార్ వైపు పరుగులు పెట్టాడు.
కోఠి గల్లీల్లో ఛేజింగ్..
అన్సారీని పట్టుకునేందుకు తన గన్‌మెన్‌తో కలిసి డీసీపీ చైతన్య ఛేజింగ్ చేశారు. ఇసామియా బజార్‌లోని ఓ గల్లీలోకి వెళ్లిన అన్సారీ.. అక్కడి నుండి బయటపడే మార్గం లేకపోవడంతో ఓ ఇంట్లోకి చొరబడ్డాడు. ఆ ఇంటి పైభాగంలోకి వెళ్లాడు.
అన్సారీ వెనకే గన్‌మెన్ వెళ్లి, అతణ్ని పట్టుకోడానికి ప్రయత్నించాడు. దీంతో అన్సారీ తన వద్ద ఉన్న కత్తితో దాడికి యత్నించాడు. అది గుర్తించిన డీసీపీ చైతన్య.. తన గన్‌మెన్‌ను కాపాడే ప్రయత్నంలో అన్సారీపై రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. అనంతరం అన్సారీ ఆ భవనం పైనుంచి పక్కనే ఉన్న విక్టోరియా ప్లే గ్రౌండ్‌లోకి దూకి పరుగులు పెట్టాడు.
కాల్పుల్లో అన్సారీ కడుపు, చేతిలోకి బుల్లెట్లు దూసుకెళ్లాయి. తీవ్ర రక్తస్రావంతో అన్సారీ గ్రౌండ్‌లోనే కుప్పకులాడు. స్థానిక పోలీసులను అప్రమత్తం చేయడంతో పాటు డీసీపీ చైతన్య , గన్‌మెన్ కలిసి అన్సారీని అదుపులోకి తీసుకున్నారు.
మలక్‌పేట్‌లోని యశోద హాస్పిటల్‌కు తరలించారు. రౌడీషీటర్‌ను పట్టుకునే సమయంలో జరిగిన తోపులాటలో డీసీపీ, గన్‌మెన్ కిందపడ్డారు. వాళ్లిద్దరికీ గాయాలయ్యాయి. పారిపోయిన మరో దొంగకోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ ఘటనపై సుల్తాన్ బజార్ పోలీసులు కేసు నమోదు చేశారు. సీసీటీవీ ఫుటేజ్‌లు సేకరించారు. ఘటనా స్థలాన్ని సీపీ సజ్జనార్ పరిశీలించారు. డీసీపీ చైతన్యను అడిగి వివరాలు తెలుసుకున్నారు.
ఆత్మరక్షణ కోసమే ఫైరింగ్..
రౌడీలు, స్నాచర్లపై ఉక్కుపాదం మోపుతాం. పోలీసులపై దాడి చేసినా, చేసేందుకు ప్రయత్నించినా ఆత్మరక్షణ కోసం ఫైరింగ్ చేయాల్సి వస్తుంది. ప్రజలపై దాడులకు దిగితే ఇలాంటి యాక్షన్ తీసుకోక తప్పదు. రౌడీషీటర్ మహ్మద్ ఒమర్ అన్సారిపై 25 కేసులు ఉన్నాయి. రెండు పీడీ యాక్ట్‌లు కూడా నమోదయ్యాయి. రెండేండ్లు జైల్లోనే ఉన్నాడు. తన గన్‌మెన్‌పై కత్తితో దాడి జరుగుతున్నదని గుర్తించిన డీసీపీ చైతన్య.. రెండు రౌండ్లు కాల్పులు జరిపాడు. ఆత్మరక్షణలో భాగంగానే కాల్పులు జరపాల్సి వచ్చింది. డీసీపీ, గన్‌మెన్ కూడా గాయపడ్డారు.
- సీపీ సజ్జనార్-
డీసీపీ చైతన్యకు హ్యాట్సాఫ్..
డీసీపీ చైతన్యకు హ్యాట్సాఫ్. డీసీపీతో పాటు ఆయన గన్‌మెన్ ధైర్యసాహసాలు పోలీసులకు స్ఫూర్తిదాయకం. శాంతిభద్రతల విషయంలో పోలీసులు రాజీపడొద్దు. ఎంతటి వారైనా సరే కఠినంగా వ్యవహరించాల్సిందే. రౌడీషీటర్లు, అరాచక, సంఘ విద్రోహ శక్తుల విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలి.
- బండి సంజయ్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి-
