
నవీ ముంబై: వరుసగా ఐదు ఓటముల తర్వాత.. విమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) బోణీ చేసింది. చిన్న టార్గెట్ ఛేజింగ్‌లో యంగ్‌స్టర్స్ కనిక అహుజా (30 బాల్స్‌లో 8 ఫోర్లు, 1 సిక్స్‌తో 46), రిచా ఘోష్ (31 నాటౌట్) చెలరేగడంతో..బుధవారం జరిగిన తమ ఆరో మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో యూపీ వారియర్స్‌కు చెక్ పెట్టింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన యూపీ 19.3 ఓవర్లలో 135 రన్స్‌కు ఆలౌటైంది. గ్రేసీ హారిస్ (32 బాల్స్‌లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 46), కిరణ్ నవ్‌గిరె (22), దీప్తి శర్మ (22) రాణించారు. తర్వాత బెంగళూరు 18 ఓవర్లలో 136/5 స్కోరు చేసి నెగ్గింది. స్టార్టింగ్‌లో యూపీ బౌలర్లు చెలరేగడంతో.. సోఫీ డివైన్ (14), కెప్టెన్ స్మృతి (0), ఎలీస్ పెర్రీ (10) ఫెయిల్ కావడంతో ఆర్‌సీబీ 43/3 స్కోరుతో కష్టాల్లో పడింది. ఈ దశలో కనిక సూపర్ షాట్లతో ఆకట్టుకుంది. హీథర్ నైట్ (24) ఓ మాదిరిగా ఆడి ఔటైనా, రిచా, కనిక ఐదో వికెట్‌కు 60 రన్స్ జోడించి విజయానికి చేరువగా తెచ్చారు. చివర్లో కనిక ఔటైనా శ్రేయాంక పాటిల్ (5 నాటౌట్) విన్నింగ్ షాట్ కొట్టింది. దీప్తి రెండు వికెట్లు తీసింది. కనికకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
బౌలర్లు అదుర్స్
మెగా టోర్నీలో బోణీ చేయలేకపోయిన ఆర్‌సీబీ ఈ మ్యాచ్‌లో సూపర్ బౌలింగ్‌తో ఆకట్టుకుంది. తొలి రెండు ఓవర్లలోనే అలీసా హీలీ (1), దేవికా వైద్య (0), తహ్లియా మెక్‌గ్రాత్ (2)ను ఔట్ చేసి బౌలర్లు అద్భుతమైన ఆరంభాన్నిచ్చారు. 5 రన్స్‌కే మూడు కీలక వికెట్లు కోల్పోయిన యూపీ ఇన్నింగ్స్‌ను ఆదుకునే బాధ్యతను నవ్‌గిరె, గ్రేసీ భుజాలకెత్తుకున్నారు. ఆర్‌సీబీ బౌలర్లందరూ ప్రభావం చూపడంతో ఈ ఇద్దరు వికెట్ కాపాడుకునేందుకు ప్రాధాన్యం ఇవ్వడంతో పవర్‌ప్లేలో కేవలం 29/3 స్కోరు మాత్రమే వచ్చింది. 7వ ఓవర్‌లో కిరణ్, 9వ ఓవర్‌లో సిమ్రాన్ షేక్ (2) కూడా పెవిలియన్‌కు చేరడంతో యూపీ 31 రన్స్‌కే సగం వికెట్లు కోల్పోయింది. ఇక్కడి నుంచి గ్రేసీతో జతకలిసిన దీప్తి వేగంగా ఆడి ఆరో వికెట్‌కు 69 (42 బాల్స్) రన్స్ జోడించడంతో 15 ఓవర్లలో స్కోరు 100కి చేరింది. కానీ 16వ ఓవర్‌లో పెర్రీ (3/16) డబుల్ షాక్ ఇచ్చింది. మూడు బాల్స్ తేడాలో దీప్తి, గ్రేసీని ఔట్ చేయడంతో స్కోరు 101/7గా మారింది. చివర్లో శ్వేత (6), ఎకిల్‌స్టోన్ (12), అంజలి (8), రాజేశ్వరి (2 నాటౌట్) ఫెయిలవడంతో యూపీ చిన్న టార్గెట్‌ను నిర్దేశించింది. డివైన్, శోభనా ఆశా చెరో రెండు వికెట్లు తీశారు.
సంక్షిప్త స్కోర్లు
యూపీ: 19.3 ఓవర్లలో 135 ఆలౌట్ (హారిస్ 46, కిరణ్ నవ్‌గిరె 22, దీప్తి 22, పెర్రీ 3/16), బెంగళూరు: 18 ఓవర్లలో 136/5 (కనిక 46, రిచా ఘోశ్ 31*, దీప్తి శర్మ 2/26).