బెంగుళూర్ తొక్కిసలాట మృతుల కుటుంబాలకు భారీ ఎక్స్‎గ్రేషియా ప్రకటించిన ఆర్సీబీ

బెంగుళూర్ తొక్కిసలాట మృతుల కుటుంబాలకు భారీ ఎక్స్‎గ్రేషియా ప్రకటించిన ఆర్సీబీ

బెంగుళూర్: ఆర్సీబీ విక్టరీ పరేడ్ సందర్భంగా బెంగుళూర్‎లో తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనలో 11 మంది మృతి చెందగా.. దాదాపు 50 మందికి పైగా గాయపడ్డారు. ఈ క్రమంలో తొక్కిసలాటలో మృతి చెందిన వారి కుటుంబాలకు ఆర్సీబీ ఎక్స్‏గ్రేషియా ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున నష్టపరిహారం అందచేస్తామని తెలిపింది. తొక్కి సలాట జరిగిన దాదాపు మూడు నెలల (84 రోజులు) తర్వాత మృతుల కుటుంబాలకు ఆర్సీబీ నష్టపరిహారం ప్రకటించడం గమనార్హం. ఈ మేరకు తమ అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్‎లో శనివారం (ఆగస్ట్ 30) పోస్ట్ పెట్టింది ఆర్సీబీ. 

‘‘2025, జూన్ 4 మా హృదయాలు ముక్కలయ్యాయి. ఆర్సీబీ కుటుంబంలోని పదకొండు మంది సభ్యులను కోల్పోయాం. వారు మనలో భాగమే. ఇవాళ వాళ్లు మన మధ్యలో లేకపోయినా ఎప్పటికీ మన జ్ఞాపకాల్లో ఉంటారు. ఎన్ని డబ్బులు ఇచ్చిన వారీ స్థానాన్ని భర్తీ చేయలేం. కానీ మొదటి అడుగుగా మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించాం. కేవలం ఆర్థిక సహయమే కాకుండా బాధిత కుటుంబాలకు  నిరంతరం సంరక్షణగా ఉంటాం’’ అని ట్వీట్‎లో పేర్కొంది ఆర్సీబీ. 

►ALSO READ | అథ్లెట్లకు తెలంగాణ ప్రభుత్వం భారీ నజరానా

2025 ఐపీఎల్ విజేతగా ఆర్సీబీ నిలిచిన విషయం తెలిసిందే. 18 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఆర్సీబీ తొలిసారి టైటిల్ గెలవడంతో ఆర్సీబీ యాజమాన్యం 2025, జూన్ 4న బెంగుళూర్‎లో విక్టరీ పరేడ్, చినస్వామి స్టేడియంలో ఆటగాళ్లకు సన్మాన కార్యక్రమం నిర్వహించింది. విజయోత్సవ ర్యాలీకి అభిమానులు భారీగా తరలిరావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 11 మంది మృతి చెందగా.. 50 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన కర్నాటక ప్రభుత్వం.. తొక్కిసలాటపై విచారణకు జ్యుడిషియల్ కమిషన్‎ను ఏర్పాటు చేసింది.