బ్రిటన్, వేల్స్‌‌లో మారుమోగిన చర్చిల గంటలు

బ్రిటన్, వేల్స్‌‌లో మారుమోగిన చర్చిల గంటలు

లండన్/వాషింగ్టన్: బ్రిటన్ క్వీన్ ఎలిజబెత్‌‌ 2కు ప్రపంచ నేతలు ఘన నివాళులర్పించారు. ఆమె సేవలను, దయాగుణాన్ని స్మరించుకున్నారు. ఆమె మృతికి నివాళిగా 96 గన్ సెల్యూట్ చేశారు. క్వీన్ బతికిన ప్రతి ఏడాదికి గుర్తుగా కార్డిఫ్ కోటలో 96 సార్లు గన్స్ పేల్చారు. దాదాపు 20 నిమిషాలపాటు ఇది కొనసాగింది. శుక్రవారం 104 రాయల్ ఆర్టిలరీ రెజిమెంట్ ఆధ్వర్యంలో యూకే అంతటా గన్ సెల్యూట్ చేశారు. తర్వాత వెస్ట్‌‌మినిస్టర్ ఆబే, సెయింట పాల్స్ కాథెడ్రల్, విండ్సర్ కాజిల్‌‌లో గంటలు మారుమోగాయి. వేల్స్‌‌లో ఉన్న చర్చ్‌‌లన్నీ మధ్యాహ్నం 12 నుంచి ఒంటి గంట దాకా గంటలు మోగించాయి. దేశవ్యాప్తంగా జెండాను అవనతం చేశారు. మరోవైపు ఆస్ట్రేలియాలోనూ 96 గన్ సెల్యూట్ చేశారు. కాన్‌‌బెర్రాలోని పార్లమెంట్ హౌస్‌‌ బయట డిఫెన్స్ ఫోర్స్ ఆధ్వర్యంలో ఎం2ఏ2 105 ఎంఎం హోవిట్జర్ సెరిమోనియల్ గన్స్‌‌ను పేల్చారు. 

ప్రపంచ నేతల నివాళి

‘‘ఆమె తన చమత్కారంతో మమ్మల్ని ముగ్ధులను చేశారు. దయతో మమ్మల్ని కదిలించారు. తన జ్ఞానాన్ని మాతో ఉదారంగా పంచుకున్నారు. 9/11 ఘటన తర్వాత మేం అనుభవించిన చీకటి రోజుల్లో అమెరికాకు సంఘీభావంగా నిలిచారు’’ అని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చెప్పుకొచ్చారు. ‘‘క్వీన్ దయగల వ్యక్తి. ఫ్రాన్స్‌‌కు ఫ్రెండ్” అని ఫ్రాన్స్‌‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మేక్రాన్ అన్నారు. రాణి ఎంతోమందికి రోల్ మోడల్‌‌ అని, స్ఫూర్తి అని జర్మనీ చాన్స్‌‌లర్ ఓలాఫ్ స్కాల్జ్‌‌ చెప్పారు. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ అల్బనీస్, న్యూజిలాండ్ ప్రధాని జసిండా ఆర్డెన్, ఇజ్రాయిల్ ప్రెసిడెంట్ ఇసాక్ హెర్జాగ్, జోర్డాన్ కింగ్ అబ్దుల్లా2, రష్యా ప్రెసిడెంట్ పుతిన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌‌స్కీ, అమెరికా మాజీ అధ్యక్షులు బరాక్ ఒబామా, డొనాల్డ్ ట్రంప్, జార్జ్‌‌ బుష్ తదితరులు నివాళులర్పించారు. 

ఎడిన్‌‌బర్​లో క్వీన్ పార్థివదేహం

రాయల్ ఫ్యామిలీలో వారంపాటు సంతాప దినాలు పాటించనున్నట్లు బకింగ్‌‌హామ్ ప్యాలెస్ శుక్రవారం ప్రకటించింది. అయితే క్వీన్ అంత్యక్రియలు ఎప్పుడు జరుగుతాయనేది ఇంకా నిర్ణయించలేదు. రెండు వారాల్లోగా వెస్ట్‌‌మినిస్టర్ ఆబేలో అంత్యక్రియలు జరిగే అవకాశం ఉంది. స్కాట్లాండ్‌‌లోని ప్యాలెస్‌‌లో క్వీన్ చనిపోవడంతో.. ఆమె పార్థివదేహాన్ని ప్రస్తుతం ఎడిన్‌‌బర్​లోని సెయింట్ గైల్స్ కాథెడ్రల్‌‌లో ఉంచారు. తర్వాత లండన్‌‌కు తరలిస్తారు.  అక్కడ ప్రజలు సందర్శించేందుకు అవకాశం కల్పిస్తారు. ఇక శనివారం బ్రిటన్ పార్లమెంటు ప్రత్యేకంగా భేటీ కానుంది.

రేపు మన దేశంలో సంతాపదినం

క్వీన్‌‌ మృతికి నివాళిగా ఆదివారం సంతాపం పాటించనున్నట్లు ఇండియా ప్రకటించింది. ఆ రోజు దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆఫీసుల్లో జాతీయ జెండాను అవనతం చేయనున్నారు. ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము, వైస్‌‌ ప్రెసిడెంట్ జగ్‌‌దీప్ ధన్‌‌కర్, ప్రధాని నరేంద్ర మోడీ తదితరులు తమ సంతాపం ప్రకటించారు. కండోలెన్స్‌‌ బుక్‌‌ను హై కమిషనర్‌‌‌‌ నివాసంలో బ్రిటీష్ హై కమిషన్ ఓపెన్ చేసింది.