
దేశమంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాల్లో ‘ఆర్‌ఆర్ఆర్’ ఒకటి. రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా కరోనా కారణంగా లేటవుతూ వచ్చింది. ఎట్టకేలకి దసరాకి వచ్చేస్తోందని అభిమానులు ఆనందపడుతుంటే ఇప్పుడు అదీ జరగడం లేదని తెలిసింది. ఈ చిత్రాన్ని దసరా రేస్ నుంచి తప్పిస్తున్నట్లు నిన్న టీమ్ ప్రకటించింది. ‘ఆర్ఆర్ఆర్’ అక్టోబర్ 13న రిలీజ్ కానుందంటూ ప్రకటించి చాలా కాలమే అయ్యింది. అనుకున్నట్టుగా షూటింగ్ పూర్తయ్యింది. అక్టోబర్ నాటికి పోస్ట్ ప్రొడక్షన్ కూడా కంప్లీటవుతుంది. అయితే ఇప్పటికీ కొన్నిచోట్ల థియేటర్లు తెరుచుకోలేదు. అందుకే రిలీజ్ వాయిదా వేస్తున్నాం, కానీ ఇప్పుడప్పుడే కొత్త డేట్‌ని అనౌన్స్ చేయలేం, పరిస్థితులు చక్కబడి ప్రపంచ సినిమా మార్కెట్ పూర్తిగా ఓపెన్ అయ్యాకే విడుదలకు ముహూర్తం పెడతాం అని తేల్చేశారు మేకర్స్. ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో అజయ్ దేవగన్, శ్రియ, సముద్రఖని, అలీసన్ డూడీ, రే స్టీవెన్‌సన్ ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు.