పేదల అకౌంట్లోకి ప్రతి నెల రూ. 8 వేలు

పేదల అకౌంట్లోకి ప్రతి నెల రూ. 8 వేలు
  •     ప్రభుత్వ ఉద్యోగాల్లో 50% రిజర్వేషన్: రాహుల్
  •     'మహిళా న్యాయ్‌‌‌‌' పేరిట ఐదు గ్యారంటీల ప్రకటన 

ముంబై: వచ్చే లోక్‌‌సభ ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి వస్తే పేద మహిళలకు ఏటా లక్ష రూపాయలు ఇస్తామని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వెల్లడించారు. అంతేగాక, ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని స్పష్టం చేశారు. భారత్ జోడో న్యాయ్ యాత్రలో భాగంగా బుధవారం ఆయన..మహారాష్ట్రలోని ధులే జిల్లాకు చేరుకున్నారు. అక్కడ మహిళలతో  నిర్వహించిన ర్యాలీలో  పాల్గొన్నారు. అనంతరం 'మహిళా న్యాయ్‌‌' పేరిట 5 గ్యారంటీలను ప్రకటించారు. 

ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ.." మహాలక్ష్మి స్కీమ్ ద్వారా పేద కుటుంబానికి చెందిన మహిళ బ్యాంకు అకౌంట్ లో  ఏటా రూ.లక్ష జమ చేస్తం. ఆధి ఆబది పూరా హక్ (సగం జనాభాకు పూర్తి హక్కులు) పేరిట కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 50%రిజర్వేషన్లు అమలు చేస్తం. మహిళా శక్తికి సన్మానం పేరిట ఆశా(అక్రెడిటెడ్ సోషల్ హెల్త్ యాక్టివిస్ట్) వర్కర్లు, అంగన్‌‌వాడీలు (ప్రభుత్వం ఆధ్వర్యంలోని మహిళా శిశు సంరక్షణ కేంద్రాలు), మధ్యాహ్న భోజన పథకాల్లో పనిచేస్తున్న మహిళల నెలవారీ వేతనానికి రెట్టింపు బడ్జెట్‌‌ కేటాయిస్తం. అధికార మైత్రి పేరిట గ్రామీణ ప్రాంతాల్లోని 2.5 లక్షల మంది మహిళలకు ఉపాధి కల్పించడంతోపాటు నోడల్ ఆఫీసర్ ద్వారా హక్కులపై మహిళలకు అవగాహన కల్పిస్తం. దేశంలోని ప్రతి జిల్లాలో మహిళల కోసం సావిత్రీబాయి ఫూలే హాస్టళ్లను ఏర్పాటుచేస్తం" అని కాంగ్రెస్ నిర్ణయించిన ఐదు నారీ న్యాయ్ హామీలను రాహుల్ వివరించారు.

రైతులు, యువతకు అన్యాయం జరిగింది

దేశంలోని పారిశ్రామికవేత్తలకు కేంద్రంలోని బీజేపీ సర్కార్  రూ.16 లక్షల కోట్లు మాఫీ చేసిందని రాహుల్ గాంధీ తెలిపారు. కానీ రైతులు, యువత రుణాలను మాత్రం కేంద్రం మాఫీ చేయలేదని ఆరోపించారు. ఇంతకంటే పెద్ద అన్యాయం ఏముంటుందని ప్రశ్నించారు. ఇలాంటి అన్యాయాల వల్లే దేశంలో హింస, విద్వేషాలు వ్యాపిస్తున్నాయని చెప్పారు. రైతులు, యువత, మహిళల సలహాతోనే తాను మణిపూర్‌‌ నుంచి ముంబైకి భారత్ జోడో న్యాయ్ యాత్రను చేపట్టినట్లు వివరించారు. ఏ నిర్ణయమైనా అన్ని కులాలు, వర్గాలను కలుపుకుని పోవాలని, జనాభాకు అనుగుణంగా వనరులను పంచాలనేదే కాంగ్రెస్‌‌ ఉద్దేశమని చెప్పారు. చట్టసభల్లో రిజర్వేషన్ల పేరిట మహిళలను కేంద్ర ప్రభుత్వం మోసం చేసిందని రాహుల్ మండిపడ్డారు. మహిళా బిల్లు అమలుకు పదేండ్ల గడువు పెట్టడం ఏమిటని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మహిళా రిజర్వేషన్లను వెంటనే అమలు చేస్తామని తెలిపారు. 

అసలు సమస్యల నుంచి దృష్టిని మళ్లిస్తున్నరు

నిరుద్యోగం, ద్రవ్యోల్బణమే దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలని రాహుల్ గాంధీ తెలిపారు. అసలు సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రకరకాల జిమ్మిక్కులు చేస్తోందని ఆరోపించారు. కేంద్రంలో తమ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తే కుల గణన చేపడతామని మరోసారి స్పష్టంచేశారు. దానివల్ల దళితులు, సాధారణ వర్గాలకు చెందిన పేదలు, మైనారిటీలు, గిరిజనులు ఎక్కడ ఉన్నారో తెలుస్తుందన్నారు. వారికి చేయూతనందిస్తే దేశంలో చాలా మార్పు వస్తుందని వెల్లడించారు. జనాభాలో యాభై శాతం మంది వద్ద దేశ సంపదలో 3 శాతం ఉంటే.. కేవలం 22 మంది వద్ద 50 శాతానికి పైగా సంపద దాగి ఉందని వివరించారు. దాన్ని వెలికి తీసి పేదలకు పంచుతామని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. కాగా, ఈ నెల 17న భారత్ జోడో న్యాయ్ యాత్ర ముంబైలో ముగియనుంది.

సీఏఏపై నాలుగేళ్లు మౌనం ఎందుకు?

పౌరసత్వ సవరణ చట్టానికి సంబంధించిన నిబంధనలు రూపొందించడానికి మోదీ ప్రభుత్వానికి నాలుగేండ్ల మూడు నెలల కాలం ఎందుకు పట్టిందని కాంగ్రెస్ కమ్యూనికేషన్స్ ఇన్​చార్జ్, జనరల్ సెక్రటరీ జైరాం రమేశ్ నిలదీశారు. లోక్​సభ ఎన్నికల టైమ్​లోనే మళ్లీ సీఏఏ అంశం ఎందుకు తెరపైకి తీసుకొచ్చారని నిలదీశారు. ‘ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ఢిల్లీ నుంచి అడుగు బయటపెట్టకపోవడం ఆశ్చర్యంగా ఉంది. ఎలాంటి ప్రారంభోత్సవాలకు వెళ్లలేదు. పదేండ్లలో చేసిన అభివృద్ధి గురించి ప్రచారం చేసేందుకు కూడా ప్రయత్నించలేదు. 

ఎన్నికల బాండ్లు రాజ్యాంగ విరుద్ధమని 2024, ఫిబ్రవరి 15న సుప్రీం తేల్చి చెప్పింది. ఈ వ్యవహారంపై ప్రధాని హోదాలో ప్రజలకు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఏ పార్టీకి.. ఎవరు.. ఎంత డబ్బులిచ్చారని చెప్పేందుకు ఆయన ఎందుకంత భయపడుతున్నారు?’’ అని జైరాం రమేశ్​ ప్రశ్నించారు. 30 కంపెనీల నుంచి రూ.335 కోట్లు బీజేపీకి విరాళాలు అందాయనేది ఫిబ్రవరి 20న తెలిసిందన్నారు. సదరు కంపెనీలపై ఈడీ, సీబీఐ, ఐటీ డిపార్ట్​మెంట్ దాడులు, కేసుల దర్యాప్తు ప్రారంభించిన వెంటనే ఈ సంస్థలు బీజేపీకి ఎందుకు విరాళాలు ఇచ్చాయని ప్రశ్నించారు. దర్యాప్తు ఏజెన్సీలతో మోదీ ప్రభుత్వం బెదిరింపులకు పాల్పడి విరాళాలు సేకరించిందని ఆరోపించారు.