బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ పెట్టుకోకుంటే రూ.లక్ష జరిమానా

బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ పెట్టుకోకుంటే రూ.లక్ష జరిమానా

దేశంలో కరోనా వైరస్ రోజు రోజుకీ విజృంభిస్తోంది. ప్రతి రోజూ వేల సంఖ్యలో కొత్త కేసుల నమోదవుతున్నాయి. వైరస్ వ్యాప్తి నియంత్రణ కోసం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా మాస్కు ధరించాలని, మనిషికి మనిషికి మధ్య కనీసం ఆరడుగులు గ్యాప్ ఉండేలా భౌతిక దూరం పాటించాలని కోరుతున్నాయి. అలాగే బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయకూడదని హెచ్చరిస్తున్నాయి. కరోనా నియంత్రణ కోసం ఈ నిబంధనలను కచ్చితంగా పాటించాలని సూచిస్తున్నాయి. అయినప్పటికీ కొద్ది మంది నిర్లక్ష్యంగా ఈ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. దీంతో వాటిని పాటించని వారికి రాష్ట్ర ప్రభుత్వాలు జరిమానాలు విధిస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా జార్ఖండ్ ప్రభుత్వం కఠినమైన నిర్ణయాలు తీసుకుంది. కరోనా వ్యాప్తి నియంత్రణ కోసం ప్రభుత్వం సూచించిన నిబంధనలను పాటించని వారికి రూ.లక్ష జరిమానా, రెండేళ్ల వరకు జైలు శిక్ష విధించాలని నిర్ణయించింది. నిన్న జరిగిన కేబినెట్ సమావేశంలో జార్ఖండ్ కంటేజియస్ డిసీజ్ ఆర్డినెన్స్‌ను జారీ చేసింది. దీని ప్రకారం కరోనా నిబంధనలను ఉల్లంఘించిన వారికి గరిష్టంగా లక్ష రూపాయల జరిమానా లేదా రెండేళ్ల జైలు శిక్ష లేదా రెండూ కలిపి విధించే అవకాశం ఉంది. కాగా, జార్ఖండ్‌లో ఇప్పటి వరకు 6485 మంది కరోనా బారినపడ్డారు. అందులో 3024 మంది పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం 3397 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.