ఆయిల్ పామ్.. సర్కార్ కామ్

ఆయిల్ పామ్.. సర్కార్ కామ్

ఆయిల్ పామ్ సాగుపై ప్రభుత్వం ఆర్భాటం చేయటం తప్ప ఆచరణలో ముందుకెళ్లటం లేదు. ప్రతీ ఏటా రెండు నుంచి మూడు లక్షల ఎకరాల్లో సాగు చేయాలని టార్గెట్ పెట్టుకున్నా.. గ్రౌండ్ లెవెల్లో అది సాధ్యం కాదనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఆయిల్ పామ్ సాగుకు అసెంబ్లీ సాక్షిగా ప్రత్యేక బడ్జెట్ కేటాయించినా చిల్లిగవ్వ కూడా రైతులకు ఇవ్వలేదు. మరికొన్ని చోట్ల సాగుకు అనుకూలం లేకున్నా రైతులను అటువైపు మళ్లించేందుకు ప్రభుత్వం ప్రయత్నించటంపై వ్యవసాయరంగ నిపుణులు మండిపడుతున్నారు.

సాగు పెంచాలని టార్గెట్

రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగుకు మంచి అనుకూలమైన నేలలున్నాయని.. ఈ పంట సాగుతో రైతులకు మంచి ఆదాయం వస్తుందని రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. రైతులను ఆటు మళ్లించే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే చాలా చోట్ల అధికారులు రైతులను ఆయిల్ పామ్ సాగువైపు మళ్లించారు. రాష్ట్రంలో మొత్తం 10 లక్షల ఎకరాల్లో సాగు లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం.. ప్రతీఏటా 2 నుంచి 3 లక్షల ఎకరాలు సాగు పెంచాలని టార్గెట్ పెట్టుకుంది. అందులో భాగంగానే రాష్ట్రవ్యాప్తంగా 30 నర్సరీలు ఏర్పాటు చేసి మొక్కలు పెంచుతోంది. 

ప్రభుత్వంపై విమర్శలు

ఆయిల్ పామ్ సాగుపై ప్రచారం చేసినంత స్థాయిలో ప్రభుత్వం దృష్టిపెట్టడం లేదనే విమర్శలు వ్యక్తమౌతున్నాయి. 2022-23 సంవత్సరానికి ఆయిల్ పామ్ సాగుకోసం బడ్జెట్ లో వెయ్యి కోట్ల రూపాయలను సర్కార్ కేటాయించింది. ఇందులో నుంచి ప్రతీ మూడు నెలలకోసారి నిధులు విడుదల చేయాలి. కానీ మొదటి మూడు నెలలు అయిపోయింది. రెండో విడత కూడా పూర్తి కాబోతోంది. అంటే దాదాపు 6 నెలలు అవుతున్నా ఇంతవరకు రూపాయి కూడా విడుదల చేయలేదు. ఈ సంవత్సరం కొత్తగా దాదాపు 20 వేల ఎకరాల్లో ఆయిల్ సాగు పామ్ చేశారు. వారికి రూపాయి కూడా ఇవ్వకపోవటంతో రైతుల్లో ఆసక్తి తగ్గుతుందని రైతు సంఘాల నేతలు అంటున్నారు. 

రైతులకు రూపాయి కూడా ఇవ్వలేదు

ఆయిల్ పామ్ సాగుచేసే రైతులకు ప్రోత్సాహం కింద 34 వేల రూపాయలు ఇవ్వాలి. కానీ ఇప్పటివరకు ఏ ఒక్క రైతుకు రూపాయి కూడా ఇవ్వలేదు. మొదటి విడతల్లోనే ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యం చేస్తే.. రానున్న రోజుల్లో పరిస్థితి ఏంటని రైతులు అంటున్నారు. ఇప్పటికే రైతుల నుంచి ఒత్తిడి పెరగటంతో అధికారులు తల పట్టుకుంటున్నారు. సాగు రైతులకు ఇవ్వాల్సిన డబ్బుల విషయాన్ని.. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని చెబుతున్నారు. ఆయిల్ పామ్ సాగు చేస్తున్న రైతులకు ఎంత ఇవ్వాలనే దానిపై పూర్తి నివేదిక ప్రభుత్వానికి ఇచ్చామని అంటున్నారు. 

రైతులను బలి చేసే కుట్ర

కొన్ని జిల్లాలు ఆయిల్ పామ్ సాగుకు అనుకూలంగా లేవు. అయినా ఆ జిల్లాల్లోనూ ఆయిల్ పామ్ సాగు చేయాలంటూ అధికారులు వత్తిడి తేవటంపై వ్యవసాయరంగ నిపుణులు మండి పడుతున్నారు. ప్రస్తుతం అధిక వర్షాలతో కొంత వాటర్ సోర్స్ పెరిగిందని.. ఇదే కంటిన్యూగా ఉండదని అంటున్నారు. అలాంటి సమయంలో ఆయిల్ పామ్ తోటలకు సరిపోను నీళ్లు లేక ఎండపోయే ప్రమాదం ఉందంటున్నారు. కంపెనీలకు లబ్ది చేకూర్చడరం కోసం రైతులను బలి చేసే కుట్ర జరుగుతోందంటున్నారు. రైతులు కూడా వాటర్ సోర్స్ ను బట్టి ఆయిల్ పామ్ సాగును ఎంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

ప్రోత్సాహకాల విషయంలో నిర్లక్ష్యం

ఇప్పటికైనా ఆయిల్ పామ్ సాగు విషయంలో ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని వ్యవసాయరంగ నిపుణులు అంటున్నారు. సాగుకు అనుకూలంగా ఉన్న ఏరియాల్లో మాత్రమే రైతులను ప్రోత్సహించాలని సూచిస్తున్నారు. రైతులకు ఇచ్చే ప్రోత్సాహకాల విషయంలో నిర్లక్ష్యం చేయకుండా వీలైనంత త్వరగా నిధులు విడుదల చేయాలని కోరుతున్నారు.