నకిలీ కంపెనీలు సృష్టించి రూ.11.79 కోట్లు కొట్టేశారు
అంతర్రాష్ట్ర జీఎస్టీ నెట్‌వర్క్ చీటింగ్ ముఠా అరెస్ట్
గచ్చిబౌలి, వెలుగు: నకిలీ కంపెనీలు సృష్టించి, నకిలీ ఇన్ వాయిస్, టర్నోవర్లు చూపించి ప్రభుత్వం నుంచి ఓ ముఠా రూ.11,79 కోట్ల ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ కొట్టేసింది. ముఠాలోని ఇద్దరిని సైబరాబాద్ ఈవోడబ్ల్యూ పోలీసులు అరెస్ట్ చేశారు. మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారు. పోలీసులు తెలిపిన ప్రకారం.. ఢిల్లీకి చెందిన అబ్దుల్లా, గుజరాత్ రాష్ట్రం భావ్‌నగర్ జిల్లా తల్ ప్రాంతానికి చెందిన సోహిల్ మురదాలి లఖానీ అలియాస్ సోను(34) , సయ్యద్ ముజ్తబా హుస్సేని అలియాస్అజామ్, అయితి రాజశేఖర్, మొహమ్మద్ అక్రమ్ హస్నుద్దీన్(43) గ్యాంగ్ గా ఏర్పడ్డారు. వీరికి అబ్దుల్లా లీడర్ గా వ్యవహరించాడు.
ఆధార్ కార్డులు, పాన్ కార్డులు, విద్యుత్ బిల్లులు, అద్దె ఒప్పందాలు, జిహెచ్ఎంసీ లైసెన్స్‌లు, కార్మిక శాఖ సర్టిఫికెట్లను ఉపయోగించి నకిలీ గుర్తింపులు తయారు చేశారు. వీటి ద్వారా పది నకిలీ జిఎస్టీ -రిజిస్టర్డ్ సంస్థలను సృష్టించారు. ఈ నకిలీ పత్రాలను ఉపయోగించి తప్పుడు పేర్లతో సిమ్ కార్డులను కొన్నారు. జిఎస్టీ పోర్టల్‌లో ఓటీపీ -ఆధారిత ధ్రువీకరణను పూర్తి చేశారు.
నకిలీ జిఎస్టీ నంబర్‌లను పొందిన తర్వాత కొనుగోలు, అమ్మకాల నకిలీ ఇన్‌వాయిస్‌లు రూపొందించారు. దీని ద్వారా రూ.53.73 కోట్ల నకిలీ టర్నోవర్‌ను సృష్టించారు. వస్తువుల భౌతిక తరలింపు లేకుండా రూ.11.79 కోట్ల ఐటీసీ ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ క్లెయిమ్ చేశారు. మోసానికి మద్దతుగా, వారు తారుమారు చేసిన ఛాసిస్ వివరాలతో నిజమైన వాహన నంబర్లను ఉపయోగించి 405 నకిలీ ఈ -వేబిల్లులను సృష్టించారు.
దీని ద్వారా ప్రభుత్వానికి రూ.11.79 కోట్లు నష్టం వాటిల్లింది. ఈ జీఎస్టీ ఫ్రాడ్ పై కేసు నమోదు చేసుకున్న సైబరాబాద్ ఈవోడబ్ల్యూ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో బుధవారం మొహమ్మద్ అక్రమ్ హస్నుద్దీన్, సోహిల్ లఖానిని అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు అబ్దుల్లాతో పాటు మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
