లాక్‌డౌన్ ఎఫెక్ట్.. ఆర్టీసీకి రోజూ రూ. 12 కోట్ల లాస్

లాక్‌డౌన్ ఎఫెక్ట్.. ఆర్టీసీకి రోజూ రూ. 12 కోట్ల లాస్

రాష్ట్రంలో లాక్‌డౌన్ ఎఫెక్ట్ ఆర్టీసీ ఆదాయంపై పడింది. ఇప్పటికే ప్రయాణికుల ద్వారా వచ్చే ఆదాయం కోల్పోగా.. మరోవైపు కార్గో సేవలపై వచ్చే ఆదాయంపై కూడా లాక్‌డౌన్ ప్రభావం చూపుతుంది. చివరికి కార్గో బస్సుల ద్వారా ధాన్యం రవాణా చేద్దామన్నా.. ఆదరణ కరువైంది. లాక్‌డౌన్‌తో అన్ని బుకింగ్స్ ఆగిపోయి సంస్థ ఆదాయం భారీగా పడిపోయింది.

కరోనాతో ఆర్టీసీ ఆదాయం కోల్పోతుంది. సర్కార్ విధించిన లాక్‌డౌన్‌తో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. దీంతో ప్రతిరోజూ ప్రయాణికుల ద్వారా వచ్చే 12 నుంచి 13 కోట్ల ఆదాయం కోల్పోవాల్సి వస్తుంది. లాక్‌డౌన్ సడలింపులో భాగంగా ఉదయం 6 గంటల నుంచి 10 గంటల మధ్య 4 గంటల పాటు బస్సులు తిరిగినా లాభం లేకుండా పోయింది.

అంతేకాకుండా.. కార్గో సేవలపై కూడా కరోనా ఎఫెక్ట్ పడింది. లాక్‌డౌన్‌తో కార్గో, పార్సిల్ కేంద్రాలు బోసిపోతున్నాయి. నిత్యం రద్దీగా ఉండే కార్గో పార్సిల్, కొరియర్ పాయింట్లు.. లాక్‌డౌన్‌తో నిర్మానుష్యంగా మారాయి. ఆర్టీసీ సిబ్బంది తప్ప ఎక్కడా కష్టమర్లు కనిపించడం లేదు. గతేడాది లాక్‌డౌన్ సమయంలో ఆర్టీసీ కార్గో సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. తక్కువ టైం లోనే ప్రైవేట్ సంస్థలకు పోటీగా ఆర్టీసీ కార్గో సేవలు ప్రజల దగ్గరకు చేరాయి. ప్రతిరోజు లక్షల్లో పార్సిల్, కొరియర్లను కస్టమర్లకు చేరవేస్తూ.. లక్షల్లో ఆదాయం రాబట్టింది. మూడు నెలల క్రితం డోర్ టు డోర్ సర్వీసును కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇలా డైలీ 16 లక్షల వరకు ఆదాయం సంపాదించే స్థాయికి చేరిన ఆర్టీసీ కార్గో.. ఇప్పుడు ఒక్కసారిగా పడిపోయింది.

లాక్‌డౌన్‌తో కార్గో డైలీ ఆదాయం 16 లక్షల నుంచి 2 లక్షలకు పడిపోయిందని ఆర్టీసీ ప్రతినిధులు అంటున్నారు. ఆ రెండు లక్షల ఆదాయం కూడా జేబీఎస్, ఎంజీబీఎస్ బస్టాండ్ల కార్గో పాయింట్లతో ధాన్యం రవాణా చేయడం వల్ల వస్తుందని తెలిపారు. నిజామాబాద్, కరీంనగర్, మహబూబ్‌నగర్, కామారెడ్డి జిల్లాలో ధాన్యం రవాణా కోసం 60 వరకు కార్గో బస్సులను వాడుతున్నట్లు చెప్పారు. వీటి ద్వారానే లక్ష వరకు ఆదాయం వస్తుందని.. ఇతర జిల్లాలో మాత్రం ధాన్యం రవాణాకు కార్గో బస్సులు అందుబాటులో ఉంచినా ఆదరణ లేదని అంటున్నారు.