- దిగుబడి సగం వరకు తగ్గే అవకాశాలు
- నల్గొండ, సూర్యాపేట జిల్లాలో రూ.2 వేల కోట్ల వరకు నష్టం ఉంటుందని అంచనా
- లబోదిబోమంటున్న రైతులు
నల్గొండ, వెలుగు: అకాల వర్షాలు పత్తి రైతులను నట్టేట ముంచాయి. నెల రోజుల నుంచి వరుస వర్షాల కారణంగా చేతికొచ్చే దశలో పత్తి చేలు పూర్తిగా దెబ్బతిన్నాయి. పదిహేను రోజుల క్రితం కురిసిన వర్షాలకు తెంపిన పత్తి నల్లబారడం తో పాటు కాయలు, పిందెలు రాలి రైతులు తీవ్రంగా నష్టపోయారు. తిరిగి రెండవ దశ పత్తి ఏరే సమయానికి తుపాను కారణంగా నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. దీంతో తెంపడానికి చేను మీద ఉన్న పత్తి మొత్తం రాలిపోయింది. దీనికి తోడు పత్తి చేలలో పెద్ద ఎత్తున నీరు చేరి చేలు ఎండిపోయే స్థితికి చేరుకున్నాయి.
తగ్గిన దిగుబడి
పత్తి ఏరే సమయంలో మంచి ఎండ ఉండాలి. ఇప్పటికీ వానలు పడుతుండడం, మబ్బులు పట్టడంతో పత్తికాయలు పగలడం లేదు. కొన్ని చోట్ల పత్తికాయలు చెట్ల మీదనే కుళ్ళిపోయి రాలిపోతున్నాయి. పూత, పిందె దశలో చేలలో నీళ్లు నిలిచిపోయి పత్తి మొక్కలు వాడిపోయి ఎర్రబారుతున్నాయి. పత్తి కాయల్లో తేమశాతం పెరగడంతో నల్లబారి మొలకలు వస్తున్నాయి. దీంతో దిగుబడి తగ్గడమే కాకుండా పత్తి నాణ్యత కూడా దెబ్బతింటోంది.
ఎకరానికి 10 నుంచి 15 క్వింటాళ్ల దిగుబడి రావాల్సిఉండగా 5 క్వింటాళ్లు కూడా వచ్చే పరిస్థితి లేదు. పత్తి సాగు కోసం రైతులు ఎకరానికి రూ. 50వేల వరకు పెట్టుబడి పెడ్తున్నారు. దిగుబడి తగ్గడంతో పెట్టుబడి కూడా వస్తుందన్న గ్యారంటీ లేదని, పత్తి ఏరేందుకు కూలీ డబ్బుల కోసం కూడా అప్పులు చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పత్తి చేలలో వరదనీరు, బురద నిలిచిపోవడం వల్ల పత్తి తీసేందుకు కూలీలు రావడం లేదు. పత్తి నాణ్యత లేకపోవడంవల్ల మార్కెట్లో వ్యాపారులు తక్కువ రేటుకే కొంటున్నారు.
రూ.2 వేల కోట్ల మేర నష్టం..
వర్షాల కారణంగా పత్తిచేలు పెద్ద ఎత్తున దెబ్బతినడంతో సూర్యాపేట, నల్గొండ జిల్లాల రైతులకు రూ.2వేల కోట్ల నష్టం వాటిల్లినట్లు అనధికారిక లెక్కలు చెబుతున్నాయి. జిల్లా వ్యవసాయశాఖ అంచనాల ప్రకారం జిల్లా వ్యాప్తంగా ఇటీవల కురిసిన వర్షాలకు నల్గొండ జిల్లాలో 25,919 ఎకరాల్లో, సూర్యాపేట జిల్లాలో 10 వేల ఎకరాల్లో 33 శాతంపైగా పత్తిచేలకు నష్టం వాటిల్లినట్లు వ్యవ సాయ శాఖ అంచనాలు వేసింది.
కాగా అనధికారిక లెక్కల ప్రకారం లక్ష ఎకరాల్లో పత్తి చేలు దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. అపార నష్టం వాటిల్లడంతో రైతులు లబోదిబోనంటున్నారు. ప్రభుత్వం తమకు నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని వేడుకుంటున్నారు.
5,56,826 ఎకరాల్లో పత్తి సాగు
నల్గొండ జిల్లా వ్యాప్తంగా 5,56,826 ఎకరాల్లో రైతులు పత్తి సాగు చేశారు. సూర్యాపేట జిల్లాలో 90 వేల ఎకరాల్లో రైతులు పత్తి సాగు చేశారు. జూన్, జూలై మాసాలతో కురిసిన అదునైన వర్షాలకు రైతులు గుంటకలు తోలుకుని ఎరువులు పెట్టుకున్నారు. సరైన సమయంలో ఎరువులు పెట్టడంతో పత్తి చేలు ఏపుగా పెరిగి మంచి పూత, కాత వచ్చింది.
అప్పటి పరిస్థితులను బట్టి ఎకరానికి 8 క్వింటాళ్ల చొప్పున మొత్తం 45 లక్షల క్వింటాళ్ల పత్తి దిగుబడి, సూర్యాపేట జిల్లాలో 7.20 లక్షల క్వింటాళ్ల పత్తి దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. కానీ అధికారుల అంచనాలను వర్షాలు తలకిందులు చేశాయి. వరుస వర్షాలతో చేలు పూర్తిగా దెబ్బతినడంతో పత్తి రాలిపోయి సగానికి సగం పత్తి దిగుబడి తగ్గే పరిస్తితి నెలకొంది.
