ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు12.7 కోట్లు రిలీజ్ : హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ గౌతమ్

ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు12.7 కోట్లు రిలీజ్ : హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ గౌతమ్
  • హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ గౌతమ్ వెల్లడి

హైదరాబాద్ , వెలుగు: ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన ఎల్-3 కేటగిరీ లబ్ధిదారులకు బిల్లులు విడుదలయ్యాయి.  జిల్లా కలెక్టర్ల నుంచి నివేదికలు తెప్పించుకున్న అనంతరం అర్హులైన సుమారు 1072 మంది లబ్దిదారులకు రూ.12.17 కోట్ల పెండింగ్ బిల్లులను విడుదల చేసినట్లు హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ  వీపీ గౌతం తెలిపారు. ఇటీవల వరంగల్ లో చేపట్టిన రివ్యూలో..  ఎల్-3 కేటగిరీలోని లబ్ధిదారులకు బిల్స్ రిలీజ్ చేయాలని హౌసింగ్ మంత్రి పొంగులేటి ఆదేశించినట్లు చెప్పారు. 

“ ఇంటిని నిర్మించుకుంటున్న లబ్దిదారుల్లో  ఎల్-3 కేటగీరీలోని వారికి కొద్ది కాలంగా బిల్లులు నిలిచిపోయాయి. ఇందిరమ్మ ఇండ్ల బిల్లు చెల్లించే సమయంలో అన్ని అంశాలను క్షుణ్నంగా పరిశీలిస్తున్నాం. లబ్ధిదారులు  అద్దె ఇండ్లలో నివస్తుండటం, గతంలోని ఇందిరమ్మ ఇండ్ల పథకంలో లబ్ధిపొంది ఉండటం తదితర కారణాల వల్ల బిల్లులను విడుదల చేయలేదు.ఈ అంశాన్ని పరిశీలించవలసిందిగా పలువురు ప్రజాప్రతినిధులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. 

దీంతో  సొంత ఇంటి వసతి లేక అద్దె  ఇండ్లలో ఉంటూ ప్రస్తుతం ఇండ్లు కట్టుకుంటున్న వారితోపాటు, పాత ఇందిరమ్మ పథకంలో బేస్ మెంట్ పనుల వరకే లబ్ధి పొందిన వారికి బిల్లులను విడుదల చేయాలని నిర్ణయించాం. ఈ కేటగిరీలోని వారికి సంబంధించి ఆయా జిల్లా కలెక్టర్ల నుంచి సమగ్రమైన నివేదికలు తెప్పించాం. ఆ నివేదికలను అనుసరించి అర్హులైన 1072 మందికి బిల్లులను విడుదల చేశాం” అని ఎండీ గౌతమ్ సోమవారం ఓ ప్రకటనలో  పేర్కొన్నారు.