నేషనల్ హెరాల్డ్ కేసు: సోనియా, రాహుల్ గాంధీ రూ.142 కోట్లు వాడుకున్నారు.. ED సంచలన ఆరోపణ

నేషనల్ హెరాల్డ్ కేసు: సోనియా, రాహుల్ గాంధీ రూ.142 కోట్లు వాడుకున్నారు.. ED సంచలన ఆరోపణ

నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) సంచలన ఆరోపణలు చేసింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న ఇద్దరూ 142 కోట్ల రూపాయలు వాడుకున్నట్లు ఢిల్లీ కోర్టుకు తెలిపింది. 

నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసు బుధవారం (మే 21) ఢిల్లీ కోర్టులో విచారణకు వచ్చింది. ఈడీ తరఫున అడిషనల్ సొలిసిటర్ జనరల్ SV రాజు వాదించారు. 2023 నవంబర్ లో ఈ కేసులో 752 కోట్ల రూపాయల ఆస్తులను ఈడీ అటాచ్ చేసే లోపు 142 కోట్ల రూపాయలను సోనియా, రాహుల్ వాడుకున్నట్లు ఆయన ఢిల్లీ కోర్టుకు చెప్పారు. 

నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, శ్యాం పిట్రోడా, సుమన్ దూబేలతో పాటు మరికొందరికి ప్రమేయం ఉన్నట్లుగా ప్రాథమిక ఆధారాలు ఉన్నట్లు తెలిపారు. ఈ కేసులో 2021లో విచారణ మొదలవ్వగా.. ఈడీ ఇటీవలే ఛార్జిషీటు దాఖలు చేసింది. 

ఏంటీ నేషనల్ హెరాల్డ్ కేసు..

నేషనల్ హెరాల్డ్ పత్రికలో మనీలాండరింగ్ జరిగిందని 2012లో బీజేపీ నేత సుబ్రమణియన్ స్వామి కోర్టులో పిటిషన్ వేశారు.  పిటిషన్ ను కోర్టు పరిశీలించిన తర్వాత 2021లో ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. ఈ ఫిర్యాదులో సోనియా గాంధీ, ఎంపీ రాహుల్ గాంధీ, దివంగత నేతలు మోతీలాల్ వోరా, ఆస్కార్ ఫెర్నాండెజ్ వంటి కీలక కాంగ్రెస్ ప్రముఖులు, సుమన్ దూబే, సామ్ పిట్రోడా, యంగ్ ఇండియన్ అనే ప్రైవేట్ కంపెనీలు మనీలాండరింగ్ కు కుట్ర చేశారని ఆరోపించింది.

అసోసియేట్ జనరల్ లిమిటెడ్ (AJL) కి చెందిన రూ.2 వేల కోట్ల విలువైన ఆస్తులను మోసపూరితంగా సంపాదించారని ఈడీ మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. సోనియా, రాహుల్ గాంధీ, యంగ్ ఇండియన్ లో మెజార్టీ వాటాదారులు, ఒక్కొక్కరికి 38 శాతం వాటా ఉంది. ఈ కేసులో గతంలో రాహుల్, సోనియాలో ఈడీ ప్రశ్నించింది.