కానిస్టేబుల్​ కోచింగ్​కు 15 వేలు.. గ్రూప్​ 1కు 30 వేలు

కానిస్టేబుల్​ కోచింగ్​కు 15 వేలు.. గ్రూప్​ 1కు 30 వేలు
  • జాబ్​, కోచింగ్ ​టైంను బట్టి భారీగా వసూళ్లు
  • కానిస్టేబుల్​ కోచింగ్​కు 15 వేలు
  • గ్రూప్​ 1కు 30 వేలదాకా ఫీజు
  • పేరున్న ఇనిస్టిట్యూట్లలో 40 వేలు
  • ఫీజులు కట్టలేక ఇబ్బందులు పడుతున్న పేద అభ్యర్థులు 
  • టీ శాట్​లో మొదలవని క్లాసులు

హైదరాబాద్​, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం తొలివిడతలో భాగంగా 30,453 పోస్టుల భర్తీకి గ్రీన్​ సిగ్నల్​ ఇవ్వడంతో అభ్యర్థులు కోచింగ్​ సెంటర్ల బాట పడుతున్నారు. ఊర్ల నుంచి హైదరాబాద్​కు తరలి వస్తున్నారు. కరోనా మహమ్మారి, నోటిఫికేషన్లు లేకపోవడం వంటి కారణాలతో ఇన్నాళ్లూ వెలవెలబోయిన కోచింగ్​సెంటర్లు.. ఇప్పుడు నిరుద్యోగుల రాకతో కళకళలాడిపోతున్నాయి. ఇప్పటికే ఉన్నవి కాకుండా.. కొత్తవి కూడా పుట్టుకొచ్చాయి. అయితే, ఆ కోచింగ్​ సెంటర్లు తమకు ఇష్టమొచ్చినట్టు భారీగా ఫీజులను వసూలు చేస్తూ.. నిరుద్యోగ అభ్యర్థుల నుంచి దండుకుంటున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జాబ్​ కొట్టాలంటే కోచింగ్​ తీస్కుంటేనే సాధ్యమవుతుందన్న ఆలోచనతో నిరుద్యోగులు కష్టమైనా ఫీజులు కడుతున్నారు. కట్టలేని వాళ్లు తమతమ జిల్లాల్లోనే కోచింగ్​ తీసుకుంటున్నారు. 

షార్ట్​ టర్మ్​ నుంచి లాంగ్​ టర్మ్​ దాకా.. 

సబ్జెక్ట్​ వారీగా లేదంటే సిలబస్​ మొత్తం చెప్పేలా కోచింగ్​ సెంటర్లు షెడ్యూల్​ను ప్రిపేర్​ చేసుకుంటున్నాయి. 3 నెలల షార్ట్​ టర్మ్​ కోచింగ్​ నుంచి.. ఎగ్జామ్​ నిర్వహించే తేదీ వరకు లాంగ్​ టర్మ్​ కోచింగ్​లకు ప్లానింగ్​ చేస్తున్నాయి. ప్రిపేర్​ అయ్యే జాబ్​, కోచింగ్​ తీసుకునే టైంను బట్టి ఫీజులను వసూలు చేస్తున్నాయి. కానిస్టేబుల్​ కోచింగ్​ కోసం రూ.15 వేలు, ఎస్సై కోచింగ్​కు రూ.20 వేల దాకా తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. గ్రూప్​1 కోచింగ్​కు రూ.20 వేల నుంచి రూ.30 వేల దాకా వసూలు చేస్తున్నారని అంటున్నారు. ఇక, పేరున్న ఇనిస్టిట్యూట్లు అయితే రూ.40 వేల దాకా చెప్తున్నాయని అంటున్నారు. టెట్​ కోచింగ్​కు రూ.10 వేల నుంచి రూ.15 వేల దాకా తీసుకుంటున్నారు. కాగా, ఇప్పటికే కొన్ని కోచింగ్​ సెంటర్లు సిలబస్​ను స్టార్ట్​ చేశాయి. ఏ జాబ్​కు ప్రిపేర్​ కావాలన్నా కనీసం రూ.15 వేల ఫీజు కట్టాల్సిందేనని కోచింగ్​ సెంటర్ల నిర్వాహకులు చెప్తున్నారు. అయితే, కోచింగ్​ సెంటర్ల ఫీజులపై ప్రభుత్వానికి ఎలాంటి కంట్రోల్​ లేకుండాపోవడంతో కోచింగ్​ సెంటర్లు ఇష్టమొచ్చినట్టు ఫీజులను వసూలు చేస్తున్నాయన్న విమర్శలు వస్తున్నాయి.

పేదోళ్లకు తిప్పలు

కోచింగ్​ సెంటర్లు ఎక్కువగా ఫీజులు వసూలు చేస్తుండడంతో పేద అభ్యర్థులపై ప్రభావం ఎక్కువగా పడుతోంది. కరోనాతో ఇప్పటికే చాలా కుటుంబాలు ఆర్థికంగా చితికిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో అంత ఫీజు కట్టడంతో పాటు.. హాస్టల్​కు నెలనెలా రూ.4 వేలు చెల్లించడం భారమైపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాటితో పాటు పుస్తకాలు, ఇతర ఖర్చులకు మరో రూ.2 వేలు అవసరమవుతాయని, అంత కట్టే పరిస్థితి లేదని చెప్తున్నారు. ఇక, కోచింగ్​ సెంటర్లు ఎక్కువున్న ఆర్టీసీ క్రాస్​ రోడ్స్​, జవహర్​నగర్​, అశోక్​నగర్​, చిక్కడపల్లి, హిమాయత్​నగర్​, అమీర్​పేట, పంజాగుట్ట, ఎస్​ఆర్​ నగర్​, ఎల్లారెడ్డిగూడ, కూకట్​పల్లి, గచ్చిబౌలి, మాదాపూర్​, దిల్​సుఖ్​నగర్​ వంటి ప్రాంతాల్లో హాస్టళ్లకు డిమాండ్​ చాలా ఎక్కువగా ఉంది. కరీంనగర్​, ఖమ్మం సహా ఉమ్మడి వరంగల్​ జిల్లాలకు చెందిన నిరుద్యోగ అభ్యర్థులు వరంగల్​లో కోచింగ్​ తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. 

నియోజకవర్గాల్లో కోచింగ్​ సెంటర్లెక్కడ? 

ఉద్యోగాలకు ప్రిపేర్​ అయ్యే అభ్యర్థుల కోసం టీ శాట్​ ద్వారా ఫ్రీగా కోచింగ్​ ఇప్పిస్తామని మంత్రి కేటీఆర్​ ఇటీవల అసెంబ్లీలో ప్రకటించారు. అయితే, ఇప్పటివరకు ఎలాంటి క్లాసులూ మొదలు కాలేదు. దానిమీద కనీసం ప్రచారం కూడా చేయట్లేదు. ముగ్గురు ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో కోచింగ్​ సెంటర్లు పెట్టారు. ఎమ్మెల్యేలంతా వారివారి నియోజకవర్గాల్లో కోచింగ్​ సెంటర్లు పెడితే ప్రభుత్వం తరఫున సహకారం అందిస్తామనీ కేటీఆర్​ హామీ ఇచ్చారు. అయితే, దానిపై ఇటు ఎమ్మెల్యేలుగానీ..ప్రభుత్వం గానీ చప్పుడు చేయట్లేదు. ప్రభుత్వం ఉచిత కోచింగ్​ సెంటర్లు ఏర్పాటు చేస్తే ఆర్థికంగా వెనుకబడిన వారికి ఉపయోగపడుతుందని, వెంటనే ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని నిరుద్యోగులు కోరుతున్నారు.  

సర్కార్​ ఫ్రీ కోచింగ్​ సెంటర్లు పెట్టాలె 

ప్రైవేట్​ కోచింగ్​ సెంటర్లలో ఫీజులు ఎక్కువ చెప్తున్నరు. అందరూ కట్టుకోలేరు. ప్రభుత్వం నియోజకవర్గానికో ఫ్రీ కోచింగ్​ సెంటర్​ పెడ్తమని చెప్పింది కదా.. అదేదో తొందరగా ఏర్పాటు చేస్తే నిరుద్యోగ యువతకు మేలు జరుగుతది. టీ శాట్​ క్లాసులను వెంటనే స్టార్ట్​ చెయ్యాలె.  
- అమృత్​​సింగ్​, నిజామాబాద్​​

కోచింగ్​ సెంటర్లను కంట్రోల్​ చేయాలె 

ఇష్టమొచ్చినట్టు ఫీజులు వసూలు చేస్తున్న కోచింగ్​ సెంటర్లను ప్రభుత్వం కంట్రోల్​ చేయాలె. ఒక్క గ్రూప్​1 కోసం రూ.30 వేలు అడుగుతున్నరు. ఒక్కో దాంట్లో ఒక్కోలా ఫీజులు పెడుతున్నరు. ప్రభుత్వం ప్రైవేటు ఇనిస్టిట్యూట్లను మానిటర్​ చేయాలె.
- కటుక గణేశ్​, కామారెడ్డి