అవాక్కయ్యారా.. హైదరాబాద్ లో వెయ్యి 542 కోట్ల పంట రుణాలు..!

అవాక్కయ్యారా.. హైదరాబాద్ లో వెయ్యి 542 కోట్ల పంట రుణాలు..!
  •  క్షేత్ర స్థాయిలో బ్యాంకర్ల తనిఖీల్లేవ్
  •  దరఖాస్తు చేసుకుంటే ఇస్తున్నారు
  •  ఒక్క మేడ్చల్ జిల్లాలోనే 984% లోన్స్
  •  రుణమాఫీ చేస్తే ఇవన్నీ పరిగణనలోకేనా?
  •  మార్గదర్శకాల్లేకుంటే అసలు రైతులు లాస్

హైదరాబాద్: కోటీ ఐదు లక్షల జనాభా.. దేశంలోనే ఆరో అతిపెద్ద నగరం.. హైదరాబాద్ లో సమృద్ధిగా పంటలు పండుతున్నాయట. వానాకాలం, యాసంగిలో పచ్చనిపైర్లతో భాగ్య నగరం కళకళలాడుతోందట. ఇక్కడి రైతులు అనునిత్యం సాగుపనుల్లో నిమగ్నమవుతున్నారట. అందుకే వీళ్లకు జాతీయ, ప్రైవేటు బ్యాంకులు పోటీ పడి పంట రుణాలు కూడా ఇచ్చేస్తున్నాయ్. 2023–24 ఆర్థిక సంవత్సరానికి గాను డిసెంబర్ 31, 2023 వరకు హైదరాబాద్ లో 1,541.95 కోట్ల పంట రుణాలు ఇచ్చారు  బ్యాంకర్లు. అంటే మహానగరంలో పంటలు పుష్కలంగా పండుతున్నాయని మన బ్యాంకులు చెప్తున్నాయి. 

మేడ్చల్ జిల్లాలో గత ఖరీఫ్ లో కేవలం 18,199 ఎకరాలలో మాత్రమే పంటలు సాగవుతాయి. రూ.242 కోట్ల పంట రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకొన్నారు బ్యాంకర్లు.. ఆ జిల్లాలో రూ.2386.48 కోట్ల పంట రుణాలు ఇచ్చాయి. అంటే ఇది  984% అన్నమాట. రాష్ట్రంలో ఇస్తున్న మొత్తం వ్యవసాయ రుణాలలో ఎక్కువ భాగం పొందుతూ మేడ్చల్ ఫస్ట్ ప్లేస్ లో ఉంది. 

రంగారెడ్డి జిల్లా రెండో స్థానంలో ఉంది. పంటసాగు కోసం ఇవ్వాల్సిన రుణాలను మహానగరాల్లోని ఖాళీ జాగాలకు, భారీ అపార్ట్ మెంట్లకు క్రాప్ లోన్లు ఇస్తుండటమే వ్యవస్థలోని డొల్లతనాన్ని బయటపెడుతున్నది. ఈ మూడు జిల్లాల్లో హైదరాబాద్ మహానగర పాలక సంస్థ విస్తరించి ఉంది. హైదరాబాద్ జిల్లాలో మచ్చుకైనా పంటల సాగు కనిపించదు. ఇక్కడ వ్యవసాయం ఆ స్థాయిలో సాగుతోందా..? అంటే అదీ కాదు..! పట్టాదారు పాసుపుస్తకం ఆధారంగా చేసుకొని క్షేత్రస్థాయి పరిశీలన చేయకుండానే బ్యాంకర్లు పంటరుణాలు ఇస్తుండటం గమనార్హం. 

ఇలా రుణాలు తీసుకున్న వాళ్లలో అంతా రియల్టర్లు, వ్యాపారులు ఉన్నట్టు తెలుస్తోంది. ఒక సారి రుణాలు తీసుకున్న వారి వాటిని రెన్యూవల్ చేసుకుంటున్నారు. కొందరు కొత్తగా రుణాల కోసం దరఖాస్తు చేసుకుంటే ఫీల్డ్ విజిట్స్ లేకుండానే.. భూమి విలువ ఆధారంగా మంజూరు చేస్తుండటంతో మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలో ఏకంగా  984% పంట రుణాలు ఇచ్చారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. గ్రామీణ జిల్లాల్లో లక్ష్యాలను చేరుకోవడంలో వెనుకంజ వేస్తున్న బ్యాంకర్లు.. అర్బన్ జిల్లాల్లో మాత్రం పోటీ పడి రుణాలు ఇస్తుండటం గమనార్హం. పంటలు సాగు చేసే వారికి అందాల్సిన రుణాలు రియల్టర్లు, పెట్టుబడి దారులకు, పారిశ్రామిక వేత్తలకు అందుతున్నాయి. 

రుణమాఫీ వర్తిస్తుందా..?

ఆగస్టు 15 లోగా రూ. 2 లక్షల లోపు పంటరుణాలను మాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల ప్రకటించారు. ఎన్నికల్లో ఇచ్చిన ఆరుగ్యారెంటీల్లో భాగంగా ఈ మొత్తాన్ని మాఫీ చేయాల్సి ఉంటుంది. అదే జరిగితే  హైదరాబాద్ మహానగరంలోని ఈ రైతుల పరిస్థితి ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది. బల్క్ గా పంటరుణాలను మాఫీ చేస్తే వీళ్లందరూ రుణవిముక్తులవుతారు.

అసలైన రైతులకు అందాల్సిన సాయం కాస్తా పక్కదారి పట్టే అవకాశం ఉంది. ఈ కలుపు మొక్కల ఏరివేతకు సరైన మార్గదర్శకాలను రూపొందిచకుంటే రైతుల ముసుగులో రియల్టర్లు, వ్యాపారులు, పారిశ్రామిక వేత్తలు లబ్ధిపొందే అవకాశం ఉందనే వాదన బలంగా వినిపిస్తోంది.